మీ ఏటీఎం కార్డు ఎప్పుడైనా మెషిన్‌లో ఇరుక్కుపోయిందా.. ఇలాంటప్పుడు మీరేం చేస్తారు.. తోటివారిని సాయం అడుగుతారు. మెషిన్‌లో ఏదో సమస్య వచ్చిందిలే అనుకుని బ్యాంకును సంప్రదిస్తారు.ఇలాంటి సందర్భంలోనే మోసగాళ్లు పొంచి ఉంటారు. సాయం చేసే నెపంతో కార్డులు మార్చి డబ్బులు కాజేస్తారు.
కాపలా లేని ఏటీఎం సెంటర్ల వద్ద ఇలాంటి మోసగాళ్లు మాటు వేస్తున్నారు. ఏటీఎం మెషిన్లలో సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న కార్డుదారులను ఏమార్చి వారి కార్డులను క్లోనింగ్ చేయడమో మార్చేయడమో చేసి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. ఈ మోసం ఇక్కడితో ఆగిపోదు. మీ కార్డ్‌ని మార్చేసిన కేటుగాళ్లు ఆ కార్డును ఉపయోగించి అకౌంట్‌లోని డబ్బు మొత్తాన్ని నిమిషాల వ్యవధిలో కొట్టేస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం.
ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే..
ఇటువంటి అనేక ముఠాలు దేశంలోని అనేక ప్రాంతాలలో సంచరిస్తున్నాయి. డబ్బులు విత్‌డ్రా చేయడానికి ఏటీఎం మెషిన్‌లో కార్డ్ పెట్టి పిన్ ఎంటర్ చేసిన తర్వాత డబ్బు బయటకు రాగానే ఏటీఎం కార్డ్ మెషిన్‌లో ఇరుక్కుపోతుంది. ఏటీఎం స్క్రీన్‌పై అకౌంట్ బ్యాలెన్స్, ఫోన్ నంబర్, ఇతర వివరాలు కన్పిస్తాయి. మెషిన్‌లో ఏదో సమస్య తలెత్తిందని మీరు గ్రహించేలోపే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లోపలికి ప్రవేశిస్తారు. వారిలో ఒకరు మిమ్మల్ని మాటల్లో పెడతారు. మరొకరు మీ కార్డును వేరే కార్డుతో మార్చేసి కాజేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు.
తర్వాత కొద్ది సమయానికే డబ్బు విత్ డ్రా చేసినట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. భయాందోళనకు గురైన కస్టమర్‌లు బ్యాంకుకు కాల్ చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జరగాల్సిన మోసం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. కార్డ్ డియాక్టివేషన్ అనేది చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఎందుకంటే అటువంటి సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు.
అనేక మంది బాధితులు
ఇలాంటి మోసాలకు గురైన కస్టమర్లు చాలా మందే ఉన్నారు. ఢిల్లీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంకు వెళ్లగా తన కార్డ్ మెషిన్‌లో ఇరుక్కుపోయింది. సహాయం చేసే నెపంతో దుండగులు తన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకు కార్డుతో మార్చేశారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే తన మొబైల్‌లో విత్‌డ్రా నోటిఫికేషన్‌లు రావడంతో మోసపోయానని గ్రహించి వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి కార్డ్ బ్లాక్ చేయాలని కోరాడు. అయినా అకౌంట్ నుంచి డబ్బు పోవడం ఆగలేదు. ఎందుకంటే కార్డ్ డీయాక్టివేట్ చేసేందుకు సమయం పట్టింది.
అలాగే తూర్పు ఢిల్లీలో జరిగిన మరో ఘటనలో ఓ గృహిణి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏటీఎంకి వెళ్లింది. ఆమె కార్డ్ కూడా ఇలాగే ఇరుక్కుపోయింది. ఆ కార్డును మోసగాళ్లు మార్చేసి షాపింగ్ చేశారు. ఆమె వెంటనే ఫిర్యాదు చేసినా దాదాపు రూ.1 లక్ష కోల్పోయిన తర్వాత ఆ కార్డ్ డీయాక్టివేట్ అయింది.
ఇలాంటి మోసాలు జరగినప్పుడు ఏకకాలంలో బ్యాంక్ బ్రాంచ్‌ని సంప్రదించి, సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేస్తే మీ డబ్బును తిరిగి పొందడంలో సహాయపడతారని ఆర్బీఐ చెబుతోంది. అయితే బ్యాంకులు మాత్రం ఈ పిన్ నంబర్ మోసగాళ్లకు తెలిసి ఉండవచ్చని ఎప్పుడూ చెప్పే సమాధానమే చెబుతాయి. ఇక సైబర్ క్రైమ్ బ్రాంచ్ వద్ద ఇలాంటి కేసులు వేలల్లో ఉంటాయి.
65,893 మోసాలు
ఆర్బీఐ డేటా ప్రకారం.. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లకు సంబంధించి 2021-22లో 65,893 మోసాలు జరిగాయి. కస్టమర్లు నష్టపోయిన డబ్బు రూ.258.61 కోట్లు. మోసగాళ్లు రోజుకో కొత్త మార్గాన్ని కనిపెట్టి కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నివారించడానికి డిజిటల్, తక్కువ నగదు లావాదేవీలను ప్రోత్సహించడానికి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు..
Comments
Please login to add a commentAdd a comment