కార్డులు వాడుతున్నారా? జర భద్రం! | carefull on dusing debit card credit card in atm mitions | Sakshi
Sakshi News home page

కార్డులు వాడుతున్నారా? జర భద్రం!

Published Wed, Dec 14 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

కార్డులు వాడుతున్నారా? జర భద్రం!

కార్డులు వాడుతున్నారా? జర భద్రం!

ఇప్పుడు అందరూ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులతో కొత్త నోట్ల కోసం ఏ.టి.ఎం.లకు తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో కార్డుల వినియోగంలో, ఏ.టి.ఎం.ల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఏ.టి.ఎం.లకు వెళుతుంటే...
చూసుకొని వెళ్ళండి: మురికిపట్టి, తేడాగా కనిపిస్తున్న ఏ.టి.ఎం.ల జోలికి వెళ్ళకండి. అవి పని చేయకపోవచ్చు. మోసాలుండవచ్చు.
మెషిన్‌ చెక్‌ చేసుకోండి: కొన్ని ఏ.టి.ఎం.లు అసాధారణ రీతిలో పనిచేస్తుంటాయి. లావాదేవీ పూర్తి కావాలంటే, ‘పిన్‌ నంబర్‌’ రెండు సార్లు ఎంటర్‌ చేయమని అడుగుతున్నాయీ అంటే, వ్యవహారం తేడా అనే అర్థం. మెషిన్‌ తలుపులు తీసినట్లో, మార్పులు చేర్పులు చేసినట్లో కనిపిస్తే – ఆ మెషిన్‌లో కార్డు పెట్టి, డబ్బులు తీయకండి.
కీ ప్యాడ్‌ను కవర్‌ చేసుకోండి: ఏ.టి.ఎం.ల దగ్గర దొంగ కెమేరాలు పెట్టి, మీ పిన్‌ నంబర్‌ను పసిగట్టేందుకు మోసగాళ్ళు ప్రయత్నించవచ్చు. కాబట్టి, పిన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసేటప్పుడు ఒక చేతితో అడ్డుపెట్టడం మంచిది.

ఎవరి సాయం తీసుకోకండి: వీలైనంత వరకు మీ సొంత బ్యాంక్‌ ఏ.టి.ఎం.లు వాడడం మంచిది. వీలైతే, మీ బ్యాంక్‌ బ్రాంచ్‌కు అనుబంధంగా పెట్టిన ఏ.టి.ఎం.నీ, గార్డులున్న ఏ.టి.ఎం.నే ఉపయోగించండి. మోసాలకు వీలుండదు. ఏ.టి.ఎం.ల బయట తిరుగుతూ, సాయం చేస్తామనే వారిని నమ్మి వాళ్ళ చేతికి మీ కార్డ్, మీ పిన్‌ నంబర్‌ ఇవ్వకండి.

ఆన్‌లైన్‌ జాగ్రత్తలు...
సురక్షితమైన సైట్స్‌నే ఆశ్రయించండి: ఇ–షాపింగ్‌ చేస్తుంటే, పేరున్న వెబ్‌సైట్లనే ఆశ్రయించండి. ‘సెక్యూర్‌ సాకెట్స్‌ లేయర్‌’(ఎస్‌.ఎస్‌.ఎల్‌) సర్టిఫైడ్‌ సైట్లనే వాడండి. బ్రౌజర్‌లో యు.ఆర్‌.ఎల్‌. బాక్స్‌ పక్కన తాళంకప్ప బొమ్మ ఉన్నదీ, లేనిదీ చూస్తే అది సెక్యూర్‌ అవునా, కాదా అని తెలిసిపోతుంది. అలాగే, మీరు వెళ్ళే వెబ్‌సైట్‌ కేవలం ‘హెచ్‌.టి.టి.పి’ అని కాక, ‘హెచ్‌.టి.టి.పి.ఎస్‌’ ప్రోటోకాల్‌ అని ఉన్నదీ లేనిదీ చూసుకోండి. ‘ఎస్‌’ అంటే సెక్యూర్‌ అని అర్థం.

స్మార్ట్‌ఫోన్‌లో... యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌: మీరు వాడే కంప్యూటర్‌లో, స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దాని వల్ల మాల్‌వేర్‌ను అరికట్టగలుగుతాం. స్మార్ట్‌ఫోన్‌లో లావాదేవీలు జరుపుతున్నట్లయితే, ఐడెంటిటీ దొంగతనాల్ని కనిపెట్టే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోండి. అలాగే, ఒకవేళ మొబైల్‌ పోతే, రిమోట్‌గానే దానిలోని డేటా మొత్తాన్నీ మనం చెరిపేసే సాఫ్ట్‌వేర్‌ పెట్టుకోండి.

డెబిట్‌ కార్డ్‌ వద్దు: ఇ–కామర్స్‌ లావాదేవీలకి మీ డెబిట్‌ కార్డు వాడద్దు. ఎందుకంటే, ఏదైనా తేడా వస్తే, ఖాతాలోని మొత్తం డబ్బు చౌర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. దాని బదులు క్రెడిట్‌ కార్డు వాడితే డబ్బు పోయే సమస్యా ఉండదు. ఆ ఖర్చు తాలూకు డబ్బు తిరిగి క్రెడిట్‌కార్డ్‌ వాళ్ళకు చెల్లించడానికి నెలరోజుల టైమ్‌ దొరుకుతుంది.

పబ్లిక్‌ వై–ఫై వాడకండి: సెక్యూర్డ్‌ కాని వై–ఫై నెట్‌వర్క్‌లనీ, అందరికీ అందుబాటులో ఉండే పబ్లిక్‌ వై–ఫైలనూ నగదు లావాదేవీలకు వాడద్దు. వాటి నుంచి మీ ఐడెంటిటీని చోరీ చేయడం చాలా ఈజీ.

అలర్ట్‌లు వచ్చేలా రిజిస్టర్‌ చేసుకోండి: ఇది ముఖ్యం. ఎందుకంటే, మీ ఖాతా నుంచి ఏ.టి.ఎం.లో డబ్బు డ్రా చేసినా, ఆన్‌లైన్‌లో కార్డుతో లావాదేవీలు జరిపినా ఫోన్‌లో ఎస్‌.ఎం.ఎస్‌. అలర్ట్‌ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటే, ఎక్కడైనా తేడా వస్తే వెంటనే మీకు తెలిసిపోతుంది. అలాగే, ఒకవేళ మీ మొబైల్‌ నంబర్‌ మారితే, వెంటనే బ్యాంకుకు చెప్పి, కొత్త నంబర్‌కు అలర్ట్స్‌ వచ్చేలా చూసుకోండి.
∙లాగ్‌ అవుట్‌ చేయండి: సోషల్‌ మీడియా సైట్‌ల నుంచి, ఇతర ఆన్‌లైన్‌ ఖాతాల నుంచి ఎప్పటికప్పుడు లాగ్‌ అవుట్‌ అయిపోండి. దీని వల్ల మీ మొబైల్‌ ఫోన్లలోని డేటా సెక్యూర్డ్‌గా ఉంటుంది. పాస్‌వర్డ్‌లను మొబైల్‌ ఫోన్‌లలో స్టోర్‌ చేయకండి.

పాస్‌వర్డ్‌లు మార్చండి: మీ పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చండి. దీని వల్ల ఐడెంటిటీ థెఫ్ట్‌కు అవకాశం తగ్గిపోతుంది.
∙వర్చ్యువల్‌ కార్డ్‌లు వాడండి: మీరు తరచూ షాపింగ్‌ చేసేవాళ్ళు కాకపోతే, ఇలాంటి ప్రీ–పెయిడ్‌ కార్డ్‌లు వాడండి. ఈ వర్చ్యువల్‌ కార్డ్‌లు లిమిటెడ్‌ డెబిట్‌ కార్డులన్న మాట. దీని వల్ల మీ ప్రైమరీ కార్డ్‌ సమాచారం ఆ మర్చంట్‌ వద్ద ఉండదు. నిర్ణీత కాలం పూర్తి కాగానే ఈ కార్డ్‌ ఎక్స్‌పైర్‌ అయిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement