
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ నూతన చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా మెకాన్ సీఎండీ అతుల్ భట్ ఎంపికయ్యారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్ మే 31న పదవీ విరమణ చేయడంతో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) ఆధ్వర్యంలో నూతన సీఎండి ఎంపిక కోసం శుక్రవారం న్యూఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో అతుల్ భట్ ఎంపికైనట్టు పీఈఎస్‌బీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
1986లో టాటా స్టీల్‌లో కెరీర్ ప్రారంభించిన భట్‌కు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్ధలో పనిచేసిన విశేష అనుభవం ఉంది. 2002 నుంచి 2007 వరకు ఇరాన్‌లోని మిట్టల్ స్టీల్‌లో కంట్రీ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. 2007 నుంచి 2008 వరకు లండన్‌లోని ఆర్సిలరీ మిట్టల్‌లో మెర్జర్స్, ఎక్విజిషన్స్ విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. 2009 నుంచి 2010 వరకు యూరప్‌లోని మెటలక్స్ వరల్డ్ సంస్థలో కమర్షియల్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 2016 నుంచి ప్రభుత్వ రంగ ‘మెకాన్’కు సీఎండిగా ఉన్నారు.