రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ - ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. | Benefits And Losers in 2024 Budget | Sakshi
Sakshi News home page

Interim Budget 2024 Highlights: రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ - ఎవరికి లాభం, ఎవరికి నష్టం..

Published Fri, Feb 2 2024 10:57 AM | Last Updated on Fri, Feb 2 2024 11:14 AM

Benefits And Losers in 2024 Budget - Sakshi

మోదీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రైతులు, పేదలు, మహిళలు, యువకులకు అనుకూలంగా.. పర్యాటకం, గృహనిర్మాణం, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే చర్యలను ప్రకటించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమని అన్నారు. ఈ మధ్యంతర బడ్జెట్ వల్ల ఎవరికి లాభం, ఎవరి నష్టం అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

ఎవరికి లాభమంటే..

అగ్రికల్చర్
2024 మధ్యంతర బడ్జెట్ రైతుల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. పాడి రైతుల అభివృద్ధికి కావలసిన సమగ్ర కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. మత్స్య సంపదను పెంపోంచించడానికి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. నూనె గింజలపైన స్వయం సమృద్ధి సాధించడం మాత్రమే కాకుండా.. సరఫరా గొలుసులతో సహా పంటకోత అనంతర కార్యకలాపాల్లో ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించనుంది.

మిడిల్ క్లాస్
అందరికి ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా మధ్యంతర బడ్జెట్ 2024 ప్రకటనలో.. అద్దె ఇళ్లలో నివసించే వారితో పాటు మురికివాడలు లేదా అనధికార కాలనీల్లో నివసించే వారి కోసం ప్రభుత్వ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పర్యాటకం
దేశంలో పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాన్ని కూడా ప్లాన్ చేస్తోంది. భారతదేశంలోని దీవులలో టూరిజం మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఉపాధి కల్పనలు కూడా పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. 

పునరుత్పాదక శక్తి (రెన్యువబుల్ ఎనర్జీ)
2070 నాటికి భారతదేశంలో కార్బన్ స్థాయిని జీరో చేయాలనే యోచనలో భాగంగానే ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించడానికి పరిశ్రమ సబ్సిడీ ప్రోగ్రామ్ కోసం చూస్తోంది. పునరుత్పాదక శక్తి 1 గిగావాట్‌ల ప్రారంభ సామర్థ్యం కోసం పవన శక్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను ప్రకటించినప్పటికీ, అది అంచనాల కంటే తక్కువగా ఉంది. అయితే అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే తప్పకుండా జీరో ఎమిషన్ సాధ్యమవుతుంది.

ఎవరికి నష్టమంటే..

ఎలక్ట్రిక్ వెహికల్స్
మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టడానికి ముందు నుంచే నిర్మలమ్మ ఈవీ రంగానికి వరాల జల్లు కురిపిస్తుంది చాలామంది భావించారు. అయితే బడ్జెట్ ప్రకటన ఊహాతీతంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాల పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎలక్ట్రిక్ వాహనాలతో మరింత విస్తరించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది, కానీ మార్చిలో ముగియనున్న సబ్సిడీ పొడిగింపుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు వెల్లడించలేదు.

జ్యువెల్లర్స్
బంగారంపై దిగుమతి పన్నును ప్రభుత్వం 15 శాతం వద్ద యథాతథంగా ఉంచడంతో టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కో, కళ్యాణ్ జువెలర్స్ ఇండియా లిమిటెడ్, సెన్కో గోల్డ్‌తో సహా జ్యువెలరీ షేర్లు పడిపోయాయి.

మౌలిక సదుపాయాలు (ఇన్ ఫ్రాస్ట్రక్చర్)
గడిచిన 4 సంవత్సరాలలో మూలధన వ్యయాన్ని మూడింతలు చేయడంతో ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన భారీగా పెరిగింది. అయితే వచ్చే ఏడాదికి మూలధన వ్యయాన్ని 11.1 శాతం పెంచి ప్రభుత్వం రూ. 11,11,111 కోట్లు చేసింది. ఇది జీడీపీలో 3.4 శాతం ఉంటుందని కేంద్రమంత్రి వెల్లడించారు. అయినప్పటికీ ఇది అంచనాలకంటే తక్కువగా ఉంది.

ఇదీ చదవండి: సీతారామన్ కెరీర్‌లో కొత్త రికార్డ్ - కేవలం 56 నిమిషాల్లో..

పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువ గల వాటా విక్రయాలను పూర్తి చేయడంలో విఫలం కావడం వల్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని తగ్గించుకుంది. దీంతో మార్చి 2024 నాటికి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 300 బిలియన్లను పొందాలని అంచనా వేస్తోంది. ఇది మునుపటి లక్ష్యం రూ. 510 బిలియన్ల కంటే తగ్గింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement