మహిళలు, యువత, పేదలు, రైతులపై ప్రత్యేక దృష్టి సారించి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఈ బడ్జెట్‌ను సమర్పించారు . మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా ప్రభుత్వం ప్రస్తుతానికి పన్ను రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత జులైలో సమర్పించే పూర్తి బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ‘వీక్షిత్ భారత్’ నినాదంతో రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరిస్తారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
వేతనజీవులకు సంబంధించి బడ్జెట్‌లో ఎటువంటి ముఖ్యమైన ప్రకటన చేయలేదు. ఆర్థిక మంత్రి సీతారామన్ గురువారం పన్ను స్లాబ్‌లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. పాత , కొత్త పన్ను స్లాబ్‌లే ప్రస్తుతానికి కొనసాగుతాయని చెప్పారు.
వందే భారత్ తరహా బోగీలు
ప్రయాణికుల భద్రత, సౌలభ్యంమేరకు 40,000 సాధారణ రైల్వే బోగీలను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తామని మంత్రి చెప్పారు. కేంద్రం మూడు ప్రధాన ఆర్థిక రైల్వే కారిడార్ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్లు, అధిక ట్రాఫిక్ ఉన్న కారిడార్లుగా విభజించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.
మహిళాసాధికారత కోసం..
నిర్మలాసీతారామన్ ఎన్నికల ముందు బడ్జెట్ ప్రసంగంలో మహిళా సాధికారతపై దృష్టి సారించే కొన్ని ప్రతిపాదనలు ప్రకటించారు. కేంద్రం ‘లక్‌పతి దీదీ’ పథకం మంచి విజయం సాధించిందని చెప్పారు. ఈ పథకంలో భాగంగా స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు శిక్షణనిస్తారు. దాంతో వారు ఏటా కనీసం రూ.1 లక్ష రూపాయల స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, మహిళా హెల్పర్‌లందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య సంరక్షణ అందించాలని పేర్కొన్నారు.
ఇన్‌ఫ్రా రంగానికి బూస్ట్
ఆర్థికమంత్రి మాట్లాడుతూ 2024-25లో చేపట్టనున్న భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయింపులు రూ.11.1 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.1 శాతం పెరిగిందని చెప్పారు. ఇది జీడీపీలో 3.4 శాతం ఉంటుందని వివరించారు. గత 4 సంవత్సరాలలో మూలధన వ్యయం మూడింతలు కావడం వల్ల ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనపై ప్రభావం పడినట్లు తెలిపారు.
మధ్యతరగతిని ఆకర్షించేలా..
లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడానికి అద్దె నివాసాలు, మురికివాడల్లో ఉంటున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఒక పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి చెప్పారు.
అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో గ్రామీణ పేదలకు మరో 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని ఆమె ప్రకటించారు.
రక్షణ వ్యయం
ప్రభుత్వం 2024-25 ఆర్థికసంవత్సరంలో రక్షణ వ్యయాన్ని రూ.6.2 లక్షల కోట్లకు పెంచింది. ఇది మొత్తం వ్యయంలో దాదాపు 8 శాతం ఉంటుంది. రక్షణ రంగానికి ఊతమిచ్చేలా డీప్‌టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీతారామన్ చెప్పారు.
ఎఫ్‌డీఐ(ఫస్ట్ డెవలప్‌మెంట్ ఇండియా)
భారతదేశాన్ని అభివృద్ధి చేస్తే పెట్టుబడులను ఆకర్షించి మరింత వృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. ఎఫ్‌డీఐ స్ఫూర్తితో విదేశీ భాగస్వాములతో ప్రభుత్వం ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని చెప్పారు. 2014-23లో 596 బిలియన్ యూఎస్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్లు తెలిపారు. 2005-14తో పోలిస్తే దాదాపు రెండింతలుగా ఉందన్నారు.
పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం..
పరిశోధనలు, ఆవిష్కరణలు పెంచడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేలా 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణాలతో రూ.1 లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
దేశీయ పర్యాటకానికి ఊతమిచ్చేలా..
బడ్జెట్ ప్రసంగంలో లక్షద్వీప్ వంటి దేశీయ పర్యాటక స్థలాలకు ఆదరణ పెరుగుతోందని మంత్రి చెప్పారు. దేశీయంగా టూరిజం అభివృద్ధిలో భాగంగా లక్షద్వీప్‌తో ఇతర ప్రాంతాలకు పోర్ట్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాజెక్టులు ప్రారంభించాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment