ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి సున్నితమైన కౌంటర్ ఇచ్చారు ఓ చార్టెర్డ్ అకౌంటెంట్. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఐటీ శాఖ పోర్టల్‌లో సమస్యలు తలెత్తడం మీద దాన్ని అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌పై బెంగళూరుకు చెందిన సీఏ ఒకరు సోషల్ మీడియా వేదికగా అంతృప్తి వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో బసు (@Basappamv) అనే సీఏ ఓ పోస్టు పెట్టారు. దేశాన్ని నిర్మించడానికి యువ నిపుణులు వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను హాస్యాస్పదంగా ప్రస్తావించారు. "నారాయణ మూర్తి సార్, మీ సలహా మేరకు, మేము పన్ను నిపుణులం వారానికి 70 గంటలకు పైగా పని చేయడం ప్రారంభించాం. ఆదాయపు పన్ను పోర్టల్‌ను సజావుగా నడపడానికి మీ ఇన్ఫోసిస్ బృందాన్ని వారానికి కనీసం ఒక గంట పని చేయమని అడగండి" అంటూ రాసుకొచ్చారు.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను సమాచార ప్రకటన (TIS) డౌన్‌లోడ్ చేయడంలో సమస్యలను పేర్కొంటూ చాలా మంది సీఏలు బసు మనోభావాలను ప్రతిధ్వనించారు. ట్యాక్స్‌ఆరామ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్, భాగస్వామి మయాంక్ మొహంకా, "ఈ సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో సాధారణ జాప్యం జరుగుతోంది" అని పేర్కొన్నారు.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలతో జరిగిన ఆలస్యం కారణంగా చాలా మంది క్లయింట్‌ల కోసం ఏఐఎస్, టీఐఎస్‌లను పొందడంలో చాలా మంది చార్టెర్డ్ అకౌంటెంట్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పన్ను చెల్లింపుదారులను, సీఏలను ప్రభావితం చేస్తున్న పోర్టల్ సమస్యలపై అటు ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇటు ఇన్ఫోసిస్ గానీ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment