అంతరిక్షయానం ఇప్పుడు పక్కా కమర్షియల్‌గా మారిపోయింది. భూమి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కర్మన్ లైన్’ దాటి వెళ్లొస్తూ.. రోదసియానం పూర్తైందని జబ్బలు చరుచుకుంటున్నాయి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు. తద్వారా పాపులారిటీతో పాటు ప్రభుత్వ అంతరిక్ష సంస్థలతో భారీ ఒప్పందాలను సొంతం చేసుకుంటున్నాయి . ఈ క్రమంలో అమెజాన్ ఫౌండర్, బ్లూ ఆరిజిన్ స్పేస్ ఏజెన్సీ ఓనర్ జెఫ్ బెజోస్.. నాసాకు బంపరాఫర్ ప్రకటించాడు.
బ్లూ ఆరిజిన్ ఓనర్ జెఫ్ బెజోస్.. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాకు ఓ బహిరంగ లేఖ రాశాడు. నాసా చేపట్టబోయే ‘మూన్ మిషన్-2024’లో మూన్ ల్యాండర్ బాధ్యతలను తమ కంపెనీకి అప్పగించాలని, తద్వారా 2 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో దాదాపు 14 వేల కోట్ల రూపాయలు) డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించాడు. తద్వారా చరిత్రలోనే అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్‌తో వార్తల్లోకెక్కింది ఈ డీల్. అయితే ఈ లేఖపై నాసా ఇంకా స్పందించాల్సి ఉంది.
ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా 2024లో చంద్రుడి మీదకు ప్రణాళికలు వేస్తున్న నాసా.. అక్కడి అనుభవాలు 2030-మార్స్ క్రూ మిషన్ కోసం ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలో మూన్‌ల్యాండర్ కోసం ఆక్షన్ నిర్వహించింది. సుమారు 2.9 బిలియన్ డాలర్ల విలువైన ‘ది హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్’ కాంట్రాక్ట్‌ను ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఎగరేసుకుపోయింది. అయితే ఈ వ్యవహారంపై ప్రత్యర్థి బ్లూ ఆరిజిన్‌తో పాటు డైనెటిక్స్ కంపెనీలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో నాసా పునరాలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి.
ఈ తరుణంలో బెజోస్ నుంచి నాసాకు బంపరాఫర్ వెళ్లడం విశేషం. ‘ఫండింగ్ లేని కారణంగా నాసా ఒకే కాంట్రాక్టర్‌ను తీసుకుందనే విషయం తెలుసు, కానీ, పోటీతత్వం ఉంటేనే పని సమర్థవంతంగా సాగుతుందనే విషయం గుర్తించాల’ని ఆ బహిరంగ లేఖలో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌కు సూచించాడు బెజోస్. అంతేకాదు ‘బ్లూ మూన్ ల్యాండర్’ ప్రత్యేకతలను వివరించడంతో పాటు.. కక్క్ష్యలో ల్యాండర్‌ను పరీక్షించేందుకు అవసరమయ్యే ఖర్చును కూడా తామే భరించుకుంటామని బెజోస్ స్పష్టం చేశాడు. ఒకవేళ ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటే చరిత్రలోనే భారీ డిస్కౌంట్ దక్కించుకున్న క్రెడిట్ నాసా సొంతమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment