
న్యూఢిల్లీ: వస్త్రాలపై (టెక్స్‌టైల్స్) జీఎస్‌టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని జీఎస్‌టీ కౌన్సిల్ నిలిపివేసింది. పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిలిపివేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వాస్తవానికి జనవరి 1 నుంచి నూతన రేటు అమల్లోకి రావాల్సి ఉంది. నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ రాష్ట్రాల నుంచి డిమాండ్‌లు రావడంతో అత్యవసరంగా జీఎస్‌టీ మండలి శుక్రవారం భేటీ అయి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీకి ఈ అంశాన్ని అప్పగించి, ఫిబ్రవరి నాటికి పన్ను రేటుపై సిఫారసు చేయాలని కోరినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు.
పాదరక్షలకు సంబంధించిన ఇదే డిమాండ్‌కు అంగీకరించలేదన్నారు. రేట్ల హేతుబద్ధీకరణను పరిశీలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందాన్ని.. టెక్స్‌టైల్స్‌పై పన్ను రేటును పరిశీలించాలని కోరినట్టు చెప్పారు. ప్రస్తుతం మానవ తయారీ ఫైబర్‌పై 18 శాతం, మానవ తయారీ యార్న్‌పై 12 శాతం, ఫ్యాబ్రిక్స్‌పై 5 శాతం రేటు అమల్లో ఉంది. ఇన్ని రకాల పన్ను రేటు కాకుండా.. రేట్ల వ్యత్యాసానికి ముగింపు పలికి అన్ని రకాల వస్త్రాలపై (కాటన్ మినహా) జనవరి 1 నుంచి 12 శాతం రేటును అమలు చేయాలని సెప్టెంబర్‌లో జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే అన్ని రకాల పాదరక్షలపైనా 12 శాతం రేటును అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వస్త్రాలపై 12 శాతం రేటుకు సుముఖంగా లేమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తెలియజేయడం గమనార్హం.
డిమాండ్ల వల్లే..
కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రి సీతారామన్ వివరాలు వెల్లడించారు. ‘‘డిసెంబర్ నుంచి ప్రతిపాదనలు రావడం మొదలైంది. గుజరాత్ ఆర్థిక మంత్రి నుంచి కూడా లేఖ అందింది. దీంతో అత్యవసరంగా భేటీ అయి 12 శాతం రేటుకు వెళ్లకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించాం. కనుక రేట్ల పరంగా దిద్దుబాటు ఉండదు’’ అని వివరించారు. మంత్రుల ప్యానెల్ ఇచ్చే సిఫారసులపై ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో నిర్వహించే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన గల మంత్రుల బృందంలో పశ్చిమబెంగాల్, కేరళ, బిహార్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు.
పరిశ్రమ ఒత్తిడి ఉండొచ్చు..
టెక్స్‌టైల్స్‌పై రేట్ల హేతుబద్ధీకరణకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ రాత్రికిరాత్రి ఒత్తిడి వెనుక.. ధరలు పెరగడం భారంగా పరిణమిస్తుందంటూ పరిశ్రమలో ఒక వర్గం చెప్పడం వల్ల కావచ్చు. అసంఘటిత రంగం రూపంలో ఒత్తిళ్లు రావచ్చని పరిశ్రమ భావించి ఉంటుంది. కొనుగోలు దారులపై భారం పడుతుందన్న ఆలోచన కూడా ఉంది. అందుకనే ఈ అంశం తిరిగి కమిటీ ముందుకు వెళ్లింది. మరింత లోతైన అధ్యయనం చేసి వివరాలను కౌన్సిల్ ముందు ఉంచుతుంది అని సీతారామన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment