
ముంబై: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.3 శాతానికి కట్టడి చేయడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రయతి్నస్తుందని భావిస్తున్నట్లు ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్‌ఏ) సెక్యూరిటీస్ అంచనా వేసింది. అలాగే 2023–24లో 5.9 శాతం లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందని కూడా అభిప్రాయపడింది.
ఎన్నికల పరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, 2024–25లో 5.3 శాతానికి లోటును కేంద్రం కట్టడి చేయగలుగుతుందని అభిప్రాయపడింది. వ్యయ కుదింపునకు బదులుగా మూలధన వ్యయం ఆధారిత వృద్ధి ద్వారా ద్రవ్య లోటును తగ్గించుకునే వ్యూహాన్ని కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు పరిస్థితి కనబడుతోందని వివరించింది. సబ్సిడీ లీకేజీలుసహా అనవసర వ్యయాలను తగ్గించుకోవడం, డిజిటలైజేషన్ వినియోగం ద్వారా పన్ను వసూళ్లను భారీగా పెంచుకోవడం లక్ష్యంగా చర్యలు ఉంటున్నాయని వివరించింది.
2023–24లో ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే స్పష్టం చేశారు.
గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. నవంబర్ ముగిసే నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.17.40 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 64.3 శాతం). వ్యయాలు రూ.26.46 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 58.9 శాతం). వెరసి ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లకు చేరింది. మొత్తం లక్ష్యంలో (రూ.17.86 లక్షల కోట్లు) ఇది 51 శాతం.
Comments
Please login to add a commentAdd a comment