![Cement shares hits new highs on rising demand - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/1/cement.jpg.webp?itok=M2mr-Kcd)
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా పటిష్టంగా సాగుతున్న సిమెంట్ రంగ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్(అక్టోబర్- డిసెంబర్) ఫలితాలపై అంచనాలతో ఇన్వెస్టర్లు సిమెంట్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ఈ ఏడాది(2020-21) ద్వితీయార్ధంలో కంపెనీల మార్జిన్లు మరింత మెరుగుపడనున్న అంచనాలు సైతం జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సిమెంట్ రంగంలోని కొన్ని కౌంటర్లు తాజాగా చరిత్రాత్మక గరిష్టాలకు చేరగా.. మరికొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం..
లాభాలతో
ఎన్‌ఎస్‌ఈలో తొలుత శ్రీ సిమెంట్ షేరు రూ. 25,655ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇదేవిధంగా జేకే సిమెంట్ రూ. 2,080 వద్ద, రామ్‌కో సిమెంట్ రూ. 900 వద్ద చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ఈ బాటలో ఏసీసీ రూ. 1,785 వద్ద, దాల్మియా భారత్ రూ. 1,198 వద్ద, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ. 909 వద్ద 52 వారాల గరిష్టాలను తాకడం గమనార్హం. ఇతర కౌంటర్లలో కాకతీయ సిమెంట్స్, డెక్కన్ సిమెంట్స్, ఆంధ్రా సిమెంట్స్, అల్ట్రాటెక్, సాగర్‌సిమెంట్స్ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం గ్రాసిమ్ 3.4 శాతం లాభపడి రూ. 906 వద్ద, దాల్మియా భారత్ 4.5 శాతం జంప్‌చేసి రూ. 1151 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక ఏసీసీ 2 శాతం పెరిగి రూ. 1740 వద్ద, శ్రీ సిమెంట్ 2 శాతం పుంజుకుని రూ. 24,748 వద్ద, జేకే సిమెంట్ 1.3 శాతం వృద్ధితో రూ. 2066 వద్ద కదులుతున్నాయి.
అంచనాలు ఇలా
ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో(అక్టోబర్- మార్చి) సిమెంట్ కంపెనీల మార్జిన్లు మరింత మెరుగుపడనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. సిమెంటుకు కనిపిస్తున్న పటిష్ట డిమాండ్ కారణంగా విద్యుత్, ఇంధనం, రవాణా తదితర వ్యయాలను మించి ధరలు బలపడనున్నట్లు అంచనా వేస్తున్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన అక్టోబర్ -డిసెంబర్ కాలంలో ధరలు 0.8 శాతం పడినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. వెరసి 2020-21లో సిమెంట్ రంగ నిర్వహణ లాభం వార్షిక ప్రాతిపదికన 18 శాతం పుంజుకోగలదని మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. రుతుపవనాల కాలంలో సిమెంట్ ధరలు స్వల్పంగా నీరసించినప్పటికీ తిరిగి 1-2 శాతం స్థాయిలో ప్రస్తుతం బలపడినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. పెట్‌కోక్ వంటి ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ ఈ రంగంపై ప్రభావం స్వల్పమేనని అంచనా వేస్తోంది. ఈ ఏడాది క్యూ2లో సిమెంట్ అమ్మకాలు త్రైమాసిక ప్రాతిపదికన 35.7 శాతం పెరిగినట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment