న్యూఢిల్లీ: ఇండిగో బ్రాండు విమానయాన కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బోర్డుకు కంపెనీ సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ రాజీనామా చేశారు. రానున్న ఐదేళ్లలో కంపెనీలోగల వాటాను నెమ్మదిగా తగ్గించుకోనున్నట్లు వెల్లడించారు. గంగ్వాల్‌తోపాటు, సంబంధిత సంస్థలకు ఇంటర్‌గ్లోబ్‌లో 37 శాతం వాటా ఉంది. రాహుల్ భాటియా, తత్సంబంధ సంస్థలకు 38 శాతం వాటా ఉంది. దశాబ్దన్నర కాలం నుంచీ కంపెనీలో దీర్ఘకాలిక వాటాదారుగా కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా గంగ్వాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒకరోజు కంపెనీలో వాటాను విక్రయించాలన్న ఆలోచన రావడం సహజమని బోర్డు సభ్యులకు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో కంపెనీలో వాటాను తగ్గించుకోవడమే ప్రస్తుత ప్రణాళికని తెలియజేశారు.
డిసెంబర్‌లో
2021 డిసెంబర్ 30న నిర్వహించిన అత్యవసర సమావేశం(ఈజీఎం)లో వాటాదారులు ప్రమోటర్ వాటా విక్రయానికి సంబంధించిన ప్రత్యేక రిజల్యూషన్‌కు ఆమోదముద్ర వేశారు. తద్వారా కంపెనీకున్న ఇద్దరు ప్రమోటర్లలో ఎవరైనా ఒకరు వాటాను విక్రయించదలిస్తే రెండో ప్రమోటర్‌కుగల నిరాకరించే తొలి హక్కును తొలగిస్తూ తీర్మానం చేశారు. దీంతో 2019 నుంచీ గంగ్వాల్, భాటియా మధ్య నలుగుతున్న వివాదానికి తెరపడేందుకు ఈ తీర్మానం దారి చూపింది. కాగా.. ప్రస్తుతం పరిశ్రమ ఏకీకృత దారిలో నడుస్తున్న సమయాన ఇండిగోకుగల దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై తనకు అత్యంత విశ్వాసమున్నట్లు తాజాగా రాసిన లేఖలో గంగ్వాల్ పేర్కొన్నారు. దేశీ విమానయాన పరిశ్రమ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతోపాటు పురోభివృద్ధి బాటలో సాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో కంపెనీ షేరు పెరుగుదల ద్వారా కొత్త ఇన్వెస్టర్లు లాభాలు ఆర్జించగలరని అంచనా వేశారు. వాటాను క్రమంగా తగ్గించుకోవడం ద్వారా తాను సైతం లబ్ది పొందే వీలున్నట్లు పేర్కొన్నారు. అయితే భవిష్యత్ సంఘటనలు ప్రస్తుత తన ప్రణాళికలపై ప్రభావం చూపవచ్చని తెలియజేశారు.
ఇన్‌సైడర్ ప్రభావం..
తన వాటాను విక్రయించే బాటలో ఇన్‌సైడర్ సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవలసి ఉన్నట్లు గంగ్వాల్ పేర్కొన్నారు. అయితే సహవ్యవస్థాపకుడు, ప్రమోటర్, డైరెక్టర్‌గా తనకు షేరు ధరను ప్రభావితం చేయగల బయటకు వెల్లడికాని సమాచారం(యూపీఎస్) కంపెనీ అందించే వీలున్నట్లు తెలియజేశారు. ఈ సమస్యల పరిష్కారానికి వీలుగా బోర్డు నుంచి వెంటనే వైదొలగుతున్నట్లు వెల్లడించారు. దీంతో తనకు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించవద్దని కోరినట్లు తెలియజేశారు. బోర్డు నుంచి తప్పుకోవడంతో ఈ అవసరంలేదని స్పష్టం చేశారు. కాగా.. 2019 జులైలో కార్పొరేట్ పాలనా సంబంధ అంశాలపై జోక్యం చేసుకోవలసిందిగా కోరుతూ సెబీకి గంగ్వాల్ లేఖ రాయడంతో ఇద్దరు ప్రమోటర్ల మధ్య వైరం బయటపడింది. అయితే ఇవి ఆరోపణలంటూ భాటియా గ్రూప్ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో అదే ఏడాది ప్రమోటర్లిద్దరూ వివాద పరిష్కారం కోసం లండన్ అంతర్జాతీయ అర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించారు. దీంతో సెప్టెంబర్ 23న ఆర్బిట్రేషన్ కోర్టు ఈజీఎం ద్వారా ప్రమోటర్ల వాటా విక్రయ నిబంధనల మార్పును సూచించింది.
గంగ్వాల్ రాజీనామా వార్తల నేపథ్యంలో ఇండిగో షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం నష్టంతో రూ. 2,113 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 2,168– 2,091 మధ్య ఊగిసలాడింది.
Comments
Please login to add a commentAdd a comment