హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. మే నెలలో క్రెడిట్ కార్డుదార్లు ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల లావాదేవీలు జరిపారు. అంత క్రితం నెలలో ఈ లావాదేవీలు రూ.1.05 లక్షల కోట్లుగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడ్డాయనడానికి ఈ గణాంకాలు ఉదాహరణ అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. మే నెలలో 7.68 కోట్ల క్రెడిట్ కార్డ్ వినియోగదార్లు ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల కోసం రూ.71,429 కోట్లు చెల్లించారు.
పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వద్ద రూ.42,266 కోట్ల లావాదేవీలు జరిపారు. ఆన్‌లైన్‌లో 11.5 కోట్లు, పీవోఎస్ మెషీన్ల (ఆఫ్‌లైన్) వద్ద 12.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లో అధిక విలువ కలిగిన చెల్లింపులు జరిగాయి. ఏప్రిల్ నెలలో క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఆన్‌లైన్ లావాదేవీలకై రూ.65,652 కోట్లు చెల్లించారు. ఇక పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వద్ద వీరు రూ.39,806 కోట్ల లావాదేవీలు జరిపారు.
డెబిట్ కార్డులతో ఇలా..
వినియోగదార్లు ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వద్ద డెబిట్ కార్డుల ద్వారా ఏప్రిల్ నెలలో రూ.65,957 కోట్ల లావాదేవీలు జరిపారు. మే నెలలో డెబిట్ కార్డులతో పీవోఎస్ ద్వారా రూ.44,305 కోట్లు, ఈ–కామర్స్ కోసం రూ.21,104 కోట్లు ఖర్చు చేశారు. ఏప్రిల్‌లో క్రెడిట్ కార్డు కలిగిన వారు 7.51 కోట్లు. వీరికి మే నెలలో 20 లక్షల మంది తోడయ్యారు. సంఖ్య పరంగా అత్యధిక క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ 1.72 కోట్లతో ముందంజలో ఉంది. మే నాటికి జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.41 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 1.33 కోట్లుగా ఉంది.
స్వల్పంగా తగ్గిన డిపాజిట్ల వృద్ధి
మార్చిలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి స్వల్పంగా తగ్గి 10 శాతానికి వచ్చి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 11.9 శాతం వృద్ధి నమోదైందని ఆర్‌బీఐ వెల్లడించింది. 2021–22లో కరెంట్ 10.9 శాతం, సేవింగ్స్ 13.3, డిపాజిట్లు 7.9 శాతం అధికమయ్యాయి. మొత్తం డిపాజిట్లలో గృహస్తుల వాటా ఏకంగా 62.6 శాతం ఉంది. డిపాజిటర్లలో మహిళలు 19.8 శాతం ఉన్నారు. టెర్మ్ డిపాజిట్లలో రూ.1 కోటి ఆపైన ఉన్న భారీ డిపాజిట్లు 40 శాతం వాటా కైవసం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment