ముంబై: ఉపాధి, వృద్ధికి మార్గం కల్పిస్తూ, మూలధన వ్యయాలు (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్– క్యాపెక్స్) 2022–23 వార్షిక బడ్జెట్‌లో భారీగా పెరిగనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో... ఈ కేటాయింపులు అనుకునేంత ఎక్కువేం కాదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. అయితే క్లిష్ట సమయంలో సహజంగా మూలధన వ్యయాలపై కోత పెట్టాలని ప్రభుత్వాలు భావిస్తాయని, అందుకు కొంత భిన్నంగా వ్యవహరించడం హర్షణీయ పరిణామమని కూడా వ్యాఖ్యానించింది. నివేదికాంశాలను పరిశీలిస్తే..
కీలక అంశాలు
► రూ. 7.50 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో 2.91 శాతం) క్యాపెక్స్ కోసం కేటాయింపుల్లో రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల రుణాలను మినహాయిస్తే, 2022–23 ఆర్థిక సంవత్సరలో వాస్తవ వ్యయం జీడీపీలో 2.58 శాతానికి తగ్గుతుంది. 2021–22 సవరించిన అంచనాలకు ఇది దాదాపు సమానమే.
► కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు (సీపీఎస్‌ఈ) మూలధనం సమకూర్చుకోడానికి ఉద్దేశించిన అంతర్గత, అదనపు బడ్జెట్ వనరులను (ఐఈబీఆర్)ను బడ్జెట్ తగ్గించింది. ఇది మొత్తం క్యాపిటల్ వ్యయాల పెంపును వాస్తవంలో తటస్థానికి (ఆఫ్‌సెట్) చేర్చే అంశం. ఐఈబీఆర్ కరోనాకు ముందు (2018–20 ఆర్థిక సంవత్సరాల్లో) జీడీపీలో 3.33 శాతం ఉంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1.82 శాతానికి పరిమితం చేయడం జరిగింది. ఆయా అంశాలన్నీ పరిశీలనలోకి తీసుకుంటే, ఐఈబీఆర్, ఎఫెక్టివ్ (వాస్తవ) బడ్జెటరీ క్యాపెక్స్ 2018–20 ఆర్థిక సంవత్సరాల్లో తరహాలోనే 2021–22 ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీలో 5.96 శాతంగా కొనసాగే వీలుంది.
► 2021–22 సవరిత అంచనాల్లో మూలధన వ్యయాలను 2.30 శాతం నుంచి 2.60 శాతానికి (జీడీపీలో) పెంచడం జరిగింది. ఎయిర్ ఇండియా రుణాలకు సంబంధించి ఒన్‌టైమ్ వ్యయాలు రూ.51,971 కోట్ల వల్లే ఈ పెరుగుదల చోటుచేసుకుంది తప్ప మరోటి కాదు.
► ప్రభుత్వం తన క్యాపెక్స్ బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయగలుగుతున్న విషయం వాస్తవమే. అయితే గత రెండు ఆర్థిక సంవత్సరాలలో, చివరి త్రైమాసికంలోనే మాత్రమే ఎక్కువ ఖర్చు జరిగింది. అయితే ఇది సరికాదు. డిమాండ్ ప్రక్రియకు సహాయం చేయడానికి ఉద్దేశించిన నిధులను సాధ్యమైనంత త్వరగా వ్యయం చేయాల్సి ఉంటుంది.
► 2022–23 బడ్జెట్‌లో నిర్దేశించిన క్యాపెక్స్ ఉపాధికి అనుకూలంగా ఉన్నమాట వాస్తవమే. రోడ్లు, రహదారులు, రైల్వేలపై ఆయా వ్యయాలు దృష్టి పెడుతున్నాయి. అయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే మారో విభాగం రక్షణ రంగంపై బడ్జెట్ అంతగా దృష్టి సారించని విషయం స్పష్టమవుతోంది.
► మూలధనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక, మూలధన సౌలభ్యత, సానుకూలతను వినియోగించుకోడానికి రాష్ట్రాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
వ్యయ ‘బడ్జెట్’ ఇది...
పెట్టుబడులకు సంబంధించి కేంద్రం మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) 35.4 శాతం పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే (సవరిత గణాంకాల ప్రకారం రూ.6.03 లక్షల కోట్లు), 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేటాయింపులకు భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తాజా కేటాయింపులు (రూ.7.50 లక్షల కోట్లు) రెండు రెట్లు అధికమని మంత్రి తెలిపారు. ఆర్థిక మంత్రి చేసిన ప్రసంగం ప్రకారం, రాష్ట్రాలకు గ్రాంట్స్ –ఇన్–ఎయిడ్ ద్వారా మూలధన ఆస్తుల సృష్టికి ఏర్పాటు చేసిన కేటాయింపులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా 2022–23లో కేంద్ర ప్ర భుత్వ ‘సమర్థవంతమైన మూలధన వ్య యం’ (ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్‌పెన్‌డిచర్) రూ.10.68 లక్షల కోట్లు. ఇది జీడీపీలో దాదాపు 4.1 శాతానికి సమానం. ఈ విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన రూ.8.4 లక్షల కోట్ల కంటే 27 శాతం అధికం. 2020–21 కేటాయింపుల కంటే 28 శాతం ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment