ముంబై: భారత్ కంపెనీల రుణ నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) మెరుగుపడిందని స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) అనుబంధ సంస్థ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే మున్ముందు కాలంలో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండే వీలుందని వివరించింది.
2021–22 మొదటి ఆరు నెలల కాలంలో కార్పొరేట్ క్రెడిట్ రేషియో 5.04 వద్ద ఉంటే తాజా సమీక్షా కాలంలో ఈ నిష్పత్తి 5.52కు పెరిగిందని వివరించింది. పటిష్ట క్యాష్ ఫ్లోస్, పెట్టుబడులు దీనికి కారణమని దాదాపు 6,800 కంపెనీలకు రేటింగ్ ఇచ్చే క్రిసిల్ నివేదిక వివరించింది. అయితే కొన్ని చిన్న పరిశ్రమలకు తమ అధ్యయనం వర్తించబోదని మేనేజింగ్ డైరెక్టర్ గురుప్రీత్ చౌహాత్‌వాలా పేర్కొన్నారు.
అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య విధానం వంటి అంశాలు ఉన్నప్పటికీ, భారత్ కార్పొరేట్ పరిశ్రమ ఈ సవాళ్లను ఎదుర్కొంటుందన్న భరోసాను క్రిసిల్ వ్యక్తం చేసింది. తాను రేటింగ్ ఇస్తున్న సంస్థల్లో 80 శాతం యథాతథ పరిస్థితిని కొనసాగించగా, 569 సంస్థలను అప్‌గ్రేడ్ చేయడం జరిగిందని, 103 సంస్థలను డౌన్‌గ్రేడ్ చేసినట్లు వివరించింది.
కాగా, ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య తన రేటింగ్ సంస్థల్లో 159కి అప్‌గ్రేడ్ చేసినట్లు 40 సంస్థలను డౌన్‌గ్రేడ్ చేసినట్లు తెలిపింది. ఇక్రా రేటింగ్స్ విషయంలో 250 సంస్థలు అప్‌గ్రేడ్‌కాగా, 76 సంస్థలు డౌన్‌గ్రేడ్ అయ్యాయి. అప్‌గ్రేడ్ సంస్థలు అధికంగా ఉండడం ఇక్కడ గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment