న్యూఢిల్లీ, సాక్షి: రెండు రోజుల క్రితం దేశీయంగా తొలిసారి చరిత్రాత్మక గరిష్టాలను తాకిన పెట్రోల్ ధరలు మరింత మండనున్నాయా? కొద్ది రోజులుగా విదేశీ మార్కెట్లో దూకుడు చూపుతున్న ముడి చమురు ధరలు తాజాగా మరింత బలపడ్డాయి. దీంతో వచ్చే వారం మరోసారి పెట్రో మంట తప్పకపోవచ్చని ఇంధన వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కోవిడ్-19 కారణంగా దేశమంతటా లాక్‌డవున్‌లు విధించిన కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ. 10 వరకూ పెంచింది. దీనికి జతగా రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ సైతం అమలవుతోంది. దీంతో గడిచిన గురువారం(7న) పెట్రోల్ ధరలు ఆల్‌టైమ్ హైను తాకిన సంగతి తెలిసిందే. వెరసి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. (ధరల మంట- పెట్రోల్ @ఆల్‌టైమ్ హై)
పన్నుల వాటా అధికం
ప్రస్తుత పెట్రోల్ ధర రూ. 84లో వివిధ పన్నుల వాటా దాదాపు రూ. 52 వరకూ ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం తగ్గించమంటూ పెట్రోలియం శాఖ ప్రభుత్వానికి తాజాగా సూచించినట్లు తెలుస్తోంది. ఇది జరిగితే పెట్రోల్ ధర లీటర్‌కు కనీసం రూ. 5 వరకూ తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 69 శాతం మంది ప్రజలు కనీసం 20 శాతం సుంకాలను తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు లోకల్ సర్కిల్స్ తెలియజేసింది.
చమురు కంపెనీలూ
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ విదేశీ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలో కోతలను తగ్గించడానికితోడు.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్‌ను తగ్గించవలసి ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంధన రంగ పీఎస్‌యూలు సైతం ఈ భారాన్ని కొంతమేర మోయవలసి రావచ్చని తెలియజేశాయి. (మళ్లీ మండుతున్న చమురు ధరలు)
మళ్లీ ధరల సెగ
విదేశీ మార్కెట్లో గత మూడు రోజుల్లో 7 శాతం జంప్‌చేసిన ముడిచమురు ధరలు మరోసారి బలపడ్డాయి. వారాంతాన న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 2.8 శాతం ఎగసి 52.24 డాలర్ల వద్ద ముగిసింది. ఇక లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ మరింత అధికంగా 3 శాతం జంప్‌చేసి56 డాలర్లకు చేరింది. వెరసి 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. దీంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు.
ఏం జరిగిందంటే?
కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఇతర ఒపెక్ దేశాలు యథావిధిగా ఉత్పత్తిని కొనసాగించేందుకు నిర్ణయించడంతో సౌదీ స్వచ్చందంగా రోజుకి 10 లక్షల బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ముందుకువచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును ఎగుమతి చేసే సౌదీ అరేబియా.. ఫిబ్రవరి, మార్చినెలల్లో కోతలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే వచ్చే రెండు నెలల్లో రష్యా, కజకిస్తాన్ సంయుక్తంగా రోజుకి 75,000 బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ తదితర దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఇంధన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి రోజుకి 5 లక్షల బ్యారళ్లవరకూ ఉత్పత్తిని పెంచేందుకు రష్యాతదితర ఒపెక్ దేశాలు ప్రతిపాదించినట్లు తెలియజేశాయి. కాగా.. మరోవైపు జనవరి 1తో ముగిసిన వారానికల్లా చమురు నిల్వలు 1.7 మిలియన్ బ్యారళ్లమేర తగ్గి 491 మిలియన్ బ్యారళ్లకు చేరినట్లు యూఎస్ ఇంధన శాఖ వెల్లడించింది. ఈ అంశాల నేపథ్యంలో చమురు ధరలు బలపడినట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment