సాక్షి, ముంబై: క్రిప్టో కరెన్సీపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ ఆస్తులు పెరగడానికి అనుమతినిస్తే మరో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని గతంలోనే హెచ్చరించిన ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం( జనవరి 13న) భారత ఆర్థిక వ్యవస్థలు, క్రిప్టో కరెన్సీ, ఆస్తులపై మాట్లాడినా ఆయన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జూదం తప్ప మరోటి కాదని అలాంటి వాటి విస్తరణను నిషేధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాటి అనియంత్రిత వృద్ధికి అనుమతించినట్లయితే కేంద్ర బ్యాంకు అధికారాన్ని కూడా బలహీనం చేస్తుందన్నారు.
క్రిప్టోకరెన్సీల పెరుగుదల వల్ల భారత ఆర్థికవ్యవస్థపై ఆర్‌బీఐ 'నియంత్రణ' కోల్పోయే అవకాశం ఉన్నందున భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నారు ఆర్‌బీఐ గవర్నర్. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా విధానాలు మార్చుకుంటూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి క్రిప్టో అప్లికేషన్ల కారణంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి విలువ లేదని కొంతమంది క్రిప్టోను ఆస్తిగా పిలుస్తారని, అలాంటప్పుడు ఆస్థికి అంతర్లీన విలువ ఉండాలని, కానీ క్రిప్టోకు అంతర్లీన విలువ లేదని శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు.
క్రిప్టో కరెన్సీలను అనుమతించడమంటే 'సెంట్రల్ బ్యాంక్' అధికారాన్ని అణగదొక్కడమేనని దాస్ తెలిపారు. దీని మూలంగా ఆర్థికవ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దేశంలో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ 'డాలరైజేషన్'కు దారితీయవచ్చని అన్నారు. ఆర్‌బిఐ నియంత్రణలో ఉన్న డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయిపై వ్యాఖ్యానిస్తూ, డిజిటల్ కరెన్సీకి లాభదాయకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బ్యాంకుల ఐటీ వ్యవస్థలు పటిష్టంగా ఉండాలని, డేటా గోప్యతపై దృష్టి పెట్టాలని దాస్ సూచించారు
క్రిప్టో లాంటి ప్రైవేట్ డిజిటల్ కరెన్సీకి పోటీగా ఆర్భీఐ "డిజిటల్ రూపాయి"ని రిలీజ్ చేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న డిజిటల్ రూపాయి, తొలుత హోల్ సెల్ వ్యాపారులకు అనంతరం రిటైల్ వ్యాపారులకు అందుబాటులోకి వస్తుందని గవర్నర్ గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment