హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలకు దేశీయంగా డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు దీటుగా, కొన్నిసార్లు అంతకు మించిన రాబడులు అందిస్తూ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) ఆకట్టుకుంటున్నాయి. దీంతో వీటిలో పెట్టుబడులపై దేశీ ఇన్వెస్టర్లలోనూ ఆసక్తి పెరుగుతోంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం దాదాపు రెండేళ్ల క్రితం వరకు రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న ఏఐఎఫ్‌ల నిధులు గతేడాది ఆఖరు నాటికి రూ. 7 లక్షల కోట్లకు చేరాయి.
రాబోయే రోజుల్లో ఇది 4–5 రెట్లు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ. 40 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ స్థాయికి చేరవచ్చని లెక్క వేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం దాకా ఎక్కువగా విదేశాల నుంచి పెట్టుబడులు వస్తుండగా ప్రస్తుతం 80– 90% నిధులు దేశీయంగా సమీకరించినవే ఉంటున్నాయి. అత్యంత సంపన్నులతో పాటు ఒక మోస్త రు ఇన్వెస్టర్లు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
మూడు రకాలు: ఈక్విటీలు, బాండ్లు, రియల్టీ వంటి సంప్రదాయ సాధనాలకే పరిమితం కాకుండా ఇతరత్రా మరిన్ని ప్రత్యామ్నాయ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను అందుకోవాలనుకునే ఇన్వెస్టర్ల కోసం ఉద్దేశించినవి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్లు. సంప్రదాయ ఫండ్స్‌తో పోలిస్తే భిన్నమైన వ్యూహాలతో, విభిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను ఆర్జించడం వీటి లక్ష్యం.
రిస్కులు ఉన్నప్పటికీ దానికి తగ్గట్లుగా మరింత రాబడులు పొందేందుకు అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా మూడు కేటగిరీల కింద దాదాపు 4,000 పైచిలుకు ఏఐఎఫ్‌లు ఉన్నాయి. ఏఐఎఫ్‌ల్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. కేటగిరీ 1 తరహా ఏఐఎఫ్‌లు ప్రధానంగా స్టార్టప్‌లు, చిన్న .. మధ్య తరహా సంస్థలు లేదా లాభదాయకమైనవిగా ప్రభుత్వం పరిగణించే రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక రెండో కేటగిరీ ఫండ్‌లో ప్రైవేట్ ఈక్విటీ, డెట్ ఫండ్స్ లాంటివి ఉంటాయి.
మూడో కేటగిరీలో హెడ్జ్ ఫండ్స్, స్వల్పకాలికంగా రాబడులు అందించే ఉద్దేశంతో ఏర్పాటయ్యే ఫండ్స్ మొదలైనవి ఉంటాయి. తొలి రెండు కేటగిరీల్లోని ఏఐఎఫ్ స్కీములు క్లోజ్ ఎండెడ్‌గా ఉంటాయి. కాల వ్యవధి పరిమితి కనీసం మూడేళ్లుగా ఉంటుంది. మూడో కేటరిగీ ఫండ్‌లు ఓపెన్ ఎండెడ్ లేదా క్లోజ్ ఎండెడ్‌గానైనా ఉండొచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఏఐఎఫ్ బెంచ్‌మార్క్ నివేదిక ప్రకారం మూడో కేటగిరీ ఏఐఎఫ్‌లు కాల వ్యవధిని బట్టి 10 శాతం నుంచి 23 శాతం వరకు రాబడులు ఇచ్చాయి.
టెక్నాలజీతో అధిక రాబడులకు ఆస్కారం..
సరైన వ్యూహాలు పాటిస్తే ఏఐఎఫ్‌ల ద్వారా మార్కెట్‌కు మించి రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉందని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్స్‌బజార్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) భూపాల్ నానావత్ తెలిపారు. ‘‘దాదాపు రూ. 3,900 కోట్ల ఫండ్స్ నిర్వహిస్తున్నాం. కొత్తగా మరో రూ. 1,000 కోట్ల ఫండ్‌కి నిధులను సమీకరిస్తున్నాం. ఏఐఎఫ్ 3 కేటగిరీ కింద లిస్టెడ్ కంపెనీల్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము. అల్గోరిథమ్‌ల వంటి అధునాతన సాంకేతికతలతో, రోబోటిక్ సిస్టమ్‌లతో రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనే వ్యూహాలను అమలుపర్చడం ద్వారా ఇన్వెస్టర్లకు అధిక రాబడులను అందిస్తున్నాం.
దీనితో 30 శాతం పైగా రాబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది’’ అని ఆయన వివరించారు. వీటిలో రూ. కోటి నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చని, హెడ్జ్ ఫండ్స్ కేటగిరీ కింద షేర్లు, బాండ్లు, డెరివేటివ్‌లు, కమోడిటీలు వంటి విస్తృత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు. ఫిక్సిడ్ డిపాజిట్లు, మార్కెట్లకు మించిన రాబడులు అందించే సాధనాలేవీ లేవంటూ ఇన్వెస్టర్లలో నెలకొన్న అపోహలను తొలగించేందుకు, ఏఐఎఫ్‌లు వంటి సాధనాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని నానావత్ చెప్పారు.
- భూపాల్ నానావత్, షేర్స్‌బజార్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment