
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) రికార్డు నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు 42 శాతం జంప్‌చేసి రూ. 18,549 కోట్లను తాకింది. ఇందుకు చమురు సహా రిటైల్, టెలికం విభాగాలు జోరు చూపడం సహకరించింది. అంతేకాకుండా యూఎస్ షేల్ గ్యాస్ ఆస్తుల విక్రయంతో లభించిన రూ. 2,872 కోట్ల వన్‌టైమ్ లాభం జత కలసింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 13,101 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 52 శాతం పురోగమించి రూ. 2,09,823 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 1,37,829 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. కంపెనీ ప్రధానంగా ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ), రిటైల్, జియో, న్యూఎనర్జీ బిజినెస్‌లను నిర్వహిస్తోంది.
రిటైల్ దూకుడు
ఈ ఏడాది క్యూ3లో రిలయన్స్ రిటైల్ రూ. 3,822 కోట్ల నిర్వహణ లాభాన్ని సాధించింది. నికర లాభం 23 శాతం వృద్ధితో రూ. 2,259 కోట్లకు చేరింది. టర్నోవర్ 53 శాతం ఎగసి రూ. 57,714 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 37,845 కోట్ల ఆదాయం నమోదైంది. 837 స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో 2021 డిసెంబర్‌కల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 14,412కు చేరింది. 2.3 మిలియన్ చదరపు అడుగుల వేర్‌హౌసింగ్ సామర్థ్యాన్ని సైతం అందుకుంది.
ఇతర హైలైట్స్
- 2021 డిసెంబర్‌కల్లా నగదు నిల్వలు రూ. 2,41,846 కోట్లను తాకాయి. మొత్తం రుణ భారం రూ. 2,44,708 కోట్లకు చేరింది.
- కేజీ డీ6 బ్లాకులోని ఎంజే క్షేత్రం నుంచి 2022–23 మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ఉత్పత్తి ప్రారంభంకాగలదని అంచనా వేస్తోంది.
- మార్కెట్లు ముగిశాక ఆర్‌ఐఎల్ ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఐఎల్ షేరు యథాతథంగా రూ. 2,478 వద్ద ముగిసింది.
జియో స్పీడ్...
తాజా సమీక్షా కాలంలో రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం 9 శాతం వృద్ధితో రూ. 3,795 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 3,486 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 24,176 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 22,858 కోట్ల టర్నోవర్ సాధించింది. క్యూ3లో 1.02 కోట్లమంది సబ్‌స్క్రయిబర్లు జత కలిశారు. 2021 డిసెంబర్‌కల్లా వీరి సంఖ్య 42.1 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 151.6గా నమోదైంది. డేటా ట్రాఫిక్ 48 శాతం పెరిగి 23.4 బిలియన్ జీబీలకు చేరింది.
పటిష్ట వృద్ధి – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్
కీలక వినియోగ విభాగాల్లో పటిష్ట వృద్ధి నేపథ్యంలో రిటైల్ బిజినెస్ సాధారణ స్థితికి చేరుకుంది. ఇందుకు పండుగల సీజన్, దేశవ్యాప్తంగా ఆంక్షలు తొలగడం దోహదపడ్డాయి. డిజిటల్ సర్వీసుల బిజినెస్ అన్ని విభాగాల్లోనూ నిలకడైన, లాభదాయక వృద్ధిని సాధిస్తోంది. డిజిటల్, న్యూకా మర్స్ విభాగాల అండతో రిలయన్స్ రిటైల్ రికార్డ్ ఆదాయాన్ని సాధించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫుట్‌వేర్, దుస్తుల బిజినెస్ రెట్టింపుకాగా.. గ్రోసరీ విభాగం రెండంకెల వృద్ధిని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment