టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో అందరూ ఈజీగా ఫేమస్ కావాలనుకుంటున్నారు. దానికోసం ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటున్నారు. అందులో ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. దాదాపు ప్రతిఒక్కరు ఈ యాప్‌ను వాడుతున్నారు. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపార, వృత్తి పరమైన అంశాలను పంచుకోవడానికి ఇదో వేదికగా మారింది. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండడం అనేది ఒక గొప్ప అంశంగా పరిగణిస్తున్నారు.
కొంతమంది తమని తాము ఎక్కువ మందికి పరిచయం చేసుకోవడానికి ఫాలోవర్లను పెంచుకుంటే, కంపెనీలు, బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ఎక్కువ మందికి చేరవేయడానికి, సెలెబ్రెటీలు తమ అభిమానులకు చేరువలో ఉండడానికి ఇలా ఎవరికి వారు ఇందులో ఫాలోవర్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి, అందులో ఫేమస్ అవ్వడానికి ఉన్న మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అకౌంట్ ఆప్టిమైజేషన్
అకౌంట్‌కు ఏదో ఒక పేరు పెట్టేసి, నాలుగు మాటలు రాసేసి, ఒక ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా అప్లోడ్ చేస్తే సరిపోదు. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటే ఒక ప్రొఫెషనల్‌గా అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. బయోలో మీ గురించి లేదా మీ బ్రాండ్ గురించి ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను రాయాలి. ఒకవేళ ఏదైనా బ్రాండ్ గురించి ప్రమోట్ చేయాలంటే అందుకు సంబందించిన లింక్‌ను బయో, హోమ్ పేజీలో ఇవ్వాలి.
హ్యాష్ ట్యాగ్‌ల వాడకం
మీ అకౌంట్‌ను రిప్రజెంట్ చేసేలా మంచి హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అసాధారణమైన హ్యాష్ ట్యాగ్ మీకంటూ ఒక గుర్తింపుని తీసుకువస్తుంది. మీ ఆలోచనలను తెలియచెప్పడానికి హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగిస్తే, అవి మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తాయి. ఎంత క్రియేటివిటీ ఉన్నా దాన్ని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఎక్కువ మంది ఫాలోవర్లు రారనే విషయాన్ని గమనించాలి.
కచ్చితమైన సమయంలో..
రోజులో ఏ సమయానికి పోస్ట్‌లు అప్‌లోడ్ చేయాలి.. ఎలాంటి సందర్భంలో ఎలాంటి పోస్టులు పెట్టాలి అనే ఒక నిర్దేశిత క్యాలెండరు ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని పోస్టులు పెడుతున్నారనే దానికంటే ఏ టైమ్‌లో పెడుతున్నాం అనేదే ముఖ్యం. మీ ఫాలోవర్లు ఎలాంటి సమయాల్లో పోస్టులు ఎక్కువగా చూస్తారో, ఎలాంటి పోస్టులు ఇష్టపడతారో ఒక సర్వే చేయాలి. వాటి ఆధారంగా పోస్టులని క్రియేట్ చేయాలి.
లైవ్ వీడియోస్
చాలా మంది ఫొటోలు పోస్ట్ చేస్తున్నాం కదా, వీడియోస్ ఎందుకులే అనే ధోరణిలో ఉంటారు. వీటితోనే ఫాలోవర్లను పెంచుకుందాం అనుకుంటారు. మారుతున్న ప్రపంచంలో ఎక్కువ శాతం యూజర్లు వీడియోస్‌కే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి వీడియోస్, లైవ్ వీడియోస్ , స్టోరీలను అప్‌లోడ్ చేయాలి.
ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..!
కంటెంట్‌పై దృష్టి
కొంతమంది తమ బ్రాండ్‌ను పాపులర్ చేయాలనే క్రమంలో ఫాలోవర్లు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోరు. అలాంటి సందర్భాల్లో కొత్త ఫాలోవర్లు రాకపోగా, ఉన్న ఫాలోవర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టవచ్చు. కాబట్టి, మీ ఫాలోవర్లు ఎలాంటి కంటెంట్‌ను ఎక్కువ ఇష్టపడుతున్నారో రీసెర్చ్ చేయాలి. దానికి అనుగుణంగా మీరు కంటెంట్‌పై దృష్టి సారించాలి. ట్రెండింగ్ విషయాల గురించి పోస్టులు పెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment