
జొమాటో, స్విగ్గి వంటి డెలివరీ యాప్స్ వచ్చిన తరువాత నచ్చిన ఫుడ్ బుక్ చేసుకుని, ఉన్నచోటుకే తెప్పించుకుని ఆరగిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో డెలివరీలలో సమస్యలు తలెత్తుతాయి. దీనికి సంస్థలు బాధ్యత వహిస్తూ.. జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చినప్పటికీ, తాజాగా మరో సంఘటన తెరమీదకు వచ్చింది.
చైనాలోని పూనమల్లి నివాసి ఆనంద్ శేఖర్ 2023 ఆగష్టు 21న జొమాటో యాప్ ద్వారా స్థానిక రెస్టారెంట్ 'అక్షయ్ భవన్' నుంచి ఊతప్పం, దోశ కాంబోతో సహా ఇతర ఆహార పదార్థాలను 498 రూపాయలకు ఆర్డర్ చేసుకున్నారు. కానీ అతనికి ఇచ్చిన డెలివరీలో దోశ, ఊతప్పం మిస్ అయ్యాయి. ఇది గమనించి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించడానికి పదేపదే ప్రయత్నించాడు, కానీ సహాయం లభించలేదు.
జొమాటో తాను పెట్టిన పూర్తి ఆర్డర్ అందివ్వలేదని.. నష్టపరిహారం కోరుతూ తిరువల్లూరులోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో కేసు వేశారు. దీనికి జొమాటో కూడా బాధ్యత వహిస్తుందని కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు జొమాటోకు రూ. 15000 జరిమానా విధిస్తూ కమిషన్ తీర్పునిచ్చింది.