న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ప్రత్యేక సేల్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 వేల ల్యాప్‌టాప్ 40 వేలు మాత్రమే అని.. 42 ఇంచుల టీవీ జస్ట్ 15 వేలకే అని ఓ ఉదరగొడుతాయి. తీర కొనుగోలు చేసే సమయానికి కొన్ని షరతులు పెడతాయి. ఈ-కామర్స్ సంస్థల జిమ్మిక్కులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త ఈ- కామర్స్ పాలసీని తీసుకొని రాబోతుంది. ఇప్పటి వరకు ఉన్న ఈ- కామర్స్ నిబంధనలను సవరించి కొత్తగా మరో పాలసీని తీసుకొచ్చేందుకు సిద్దం అవుతుంది.
మార్కెట్‌ప్లేస్‌లు, రైడ్ కంపెనీలు, టికెటింగ్, పేమెంట్ కంపెనీలతో సహా అన్ని డిజిటల్ కామర్స్ & సర్వీస్ ప్రొవైడర్లను కవర్ చేస్తూ, అన్ని ఆన్‌లైన్ లావాదేవీలకు సమగ్ర మార్గదర్శకాలను వివరిస్తూ ప్రభుత్వం త్వరలో కొత్త ఈ-కామర్స్ పాలసీని తీసుకొని రావాలని చూస్తుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) ఆన్‌లైన్ వాణిజ్యం, డిజిటల్ ఈ-కామర్స్ పాలసీలోని ఇబ్బందులను పరిష్కరించడానికి ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాను విడుదల చేయాలని భావిస్తుంది.
మోసపూరిత ఫ్లాష్ సేల్స్, ఉత్పత్తులు.. సర్వీసులను మోసపూరితంగా విక్రయించడం వంటి వాటిని నిషేధించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ప్రతిపాదించింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వినియోగదారుల హక్కులను రక్షించడానికి కొత్త ఈ-కామర్స్ నియమాలను జారీ చేస్తుంది. కొత్తగా తీసుకొస్తున్న పాలసీలో ఇటు భారతీయ కంపెనీలతోపాటు విదేశీ పెట్టుబడి కంపెనీలకు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ నివేదిక ప్రకారం.. ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి భారతదేశంలో పనిచేస్తున్న అన్ని ఈ-కామర్స్ కంపెనీలకు ఇది సమగ్ర విధానం అని చెప్పారు. వీటిపై పరిశ్రమ వర్గాలు, ప్రజలు అభిప్రాయాలు తెలియజేయడానికి కొద్ది సమయం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment