పెట్టుబడులకు ‘రుణ’ పడదాం! | Easy loans on stocks and funds | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు ‘రుణ’ పడదాం!

Published Mon, Aug 26 2024 5:50 AM | Last Updated on Mon, Aug 26 2024 7:51 AM

Easy loans on stocks and funds

స్టాక్స్, ఫండ్స్‌పై సులువుగా రుణాలు

అత్యవసరాల్లో గట్టెక్కే మార్గం..

వడ్డీ రేట్లు కూడా తక్కువ స్థాయిలోనే

స్వల్పకాల అవసరాలకే అనుకూలం

ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. రుణం తీసుకోవడమే ఎక్కువ మంది అనుసరించే మార్గం. అవసరాన్ని వెంటనే గట్టెక్కడమే ముఖ్యంగా చూస్తుంటారు. వడ్డీ రేటు గణనీయంగా ఉండే క్రెడిట్‌కార్డు రుణాలే కాదు, వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తుంటారు. దీంతో అప్పటికి అవసరం తీరుతుందేమో కానీ, ఆ తర్వాత ఆర్థికంగా భారాన్ని మోయాల్సి వస్తుంది. కొందరు స్టాక్స్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉంటే వాటిని ఉపసంహరించుకుంటారు. కానీ, వీటికంటే మెరుగైన ఆప్షన్‌ ఉంది. స్టాక్స్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ను విక్రయించాల్సిన అవసరం లేకుండా, వాటిపై చౌక వడ్డీకే రుణం పొందొచ్చు. దీనివల్ల పెట్టుబడుల వృద్ధి ప్రయోజనాన్ని కోల్పోవాల్సిన అవసరం ఏర్పడదు. పైగా రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.  – సాక్షి, బిజినెస్‌డెస్క్‌

 ఫండ్స్‌/స్టాక్స్‌.. 
మ్యూచువల్‌ ఫండ్స్‌పై రుణం పొందడాన్ని లోన్‌ ఎగైనెస్ట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎల్‌ఏఎంఎఫ్‌)గా.. షేర్లపై రుణం పొందడాన్ని లోన్‌ ఎగైనెస్ట్‌ సెక్యూరిటీస్‌ (ఎల్‌ఏఎస్‌)గా చెబుతారు. ఇవి సెక్యూర్డ్‌ రుణాలు. మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లు/õÙర్లు లేదా బాండ్లు తదితర సెక్యూరిటీలను తనఖా పెట్టుకుని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలు మంజూరు చేస్తాయి. కనుక రుణ గ్రహీత క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉండాల్సిన అవసరం లేదు. స్వల్పకాల అవసరాల కోసం ఈ రుణాలు తీసుకోవచ్చు. వీటిపై 9–11 శాతం మధ్య వడ్డీ రేటు అమలవుతుంటుంది. మిరే అస్సెట్‌ సంస్థ 10.5 శాతం వార్షిక వడ్డీ రేటును అమలు చేస్తోంది. డిజిటల్‌గా, నిమిషాల వ్యవధిలోనే రుణం పొందే వెసులుబాటు కూడా ఉంటుంది.  

అర్హతలు..
సెబీ అనుమతించిన కంపెనీల షేర్లకే రుణాలు పరిమితం. దాదాపు అన్ని బ్లూచిప్‌ షేర్లకు, టాప్‌–250 షేర్లకు రుణాలు లభిస్తాయి. డీలిస్ట్‌ అయిన వాటికి అవకాశం లేదు. ఏఏ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లపై రుణం లభిస్తుందో.. ప్రతి బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ ఒక జాబితాను నిర్వహిస్తుంటాయి. 
⇒  ఒక్కసారి వీటిపై రుణం తీసుకున్నారంటే, అవి తనఖాలోకి వెళ్లినట్టు అర్థం చేసుకోవాలి. కనుక రుణం తీర్చే వరకు వాటిని విక్రయించలేరు.  

⇒  మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా స్టాక్స్‌ విలువలో నిర్ణీత శాతం వరకే రుణం లభిస్తుంది. ఇక్కడ కూడా లోన్‌–టు–వేల్యూ (ఎల్‌టీవీ) వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి ఆర్‌బీఐ నిర్దేశించిన ఎల్‌టీవీ 75 శాతంగా ఉంది. చాలా సంస్థలు ఈక్విటీ ఫండ్స్‌పై 50– 60% మేరకే రుణం ఇస్తున్నాయి. మిరే అస్సెట్‌ సంస్థ 45 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తోంది. రుణం ఇచ్చే బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ విడిగా రుణగ్రహీత తిరిగి చెల్లింపుల సామర్థ్యాలను అంచనా వేసుకున్న తర్వాత ఇంతకంటే తక్కువే మంజూరు చేయవచ్చు. 

పెట్టుబడుల విలువలో రుణం 50 శాతం మించకుండా ఉంటేనే నయం. ఎందుకంటే తనఖాలో ఉంచిన షేర్లు, సెక్యూరిటీలు, ఫండ్స్‌ యూనిట్ల విలువను రుణం ఇచి్చన సంస్థలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాయి. ముఖ్యంగా మార్కెట్లు కరెక్షన్‌కు లోనైతే ఈ పనిని వెంటనే చేస్తాయి. అప్పుడు లోన్‌–టు–వేల్యూని మించి రుణం విలువ పెరిగిపోతుంది. దీంతో అదనపు సెక్యూరిటీలు/ఫండ్స్‌ యూనిట్లను తనఖా ఉంచాలని అవి కోరతాయి. లేదా నగదు సర్దుబాటు చేయాలని కోరతాయి. లేదంటే అదనపు వడ్డీని విధిస్తాయి. లేదా తనఖాలో ఉంచిన వాటిని వెంటనే విక్రయించి సొమ్ము చేసుకుంటాయి. రుణం తీసుకున్న వ్యక్తి స్పందన ఆధారంగా ఈ చర్యలు ఉంటాయి. 

⇒   ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో ఈ రుణం మంజూరు అవుతుంది. ఉదాహరణకు తనఖా పెట్టిన సెక్యూరిటీలు, ఫండ్స్‌ యూనిట్లపై రూ.5 లక్షల రుణానికి 
ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం లభించిందని అనుకుందాం. అప్పుడు రూ.2 లక్షలే వినియోగించుకుంటే ఆ మొత్తంపైనే వడ్డీ పడుతుంది. ఎన్ని రోజులు వినియోగించుకుంటే, అంతవరకే వడ్డీ పడుతుంది. కాకపోతే తీసుకున్న రుణంపై వడ్డీని ప్రతినెలా చెల్లించాల్సిందే.  
⇒  రుణంపై కనిష్ట, గరిష్ట పరిమితులను బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు అమలు చేస్తున్నాయి.  

⇒  వ్యక్తిగత రుణాలను ముందస్తుగా తీర్చివేస్తే ప్రీక్లోజర్‌ చార్జీలను బ్యాంక్‌లు వసూలు చేస్తుంటాయి. కానీ, స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ రుణాలపై ప్రీ క్లోజర్‌ చార్జీల్లేవు. 

⇒  వ్యక్తిగత రుణాల మాదిరే మ్యూచువల్‌ ఫండ్స్, స్టాక్స్‌పై రుణాలను ఎందుకు వినియోగించుకోవాలనే విషయంలో షరతులు ఉండవు. చట్టవిరుద్ధమైన, స్పెక్యులేటివ్‌ అవసరాలకే వినియోగించుకోకూడదు. 
⇒  తనఖాలోని షేర్లు, స్టాక్స్‌కు సంబంధించి డివిడెండ్‌లు, బోనస్, ఇతరత్రా ప్రయోజనాలు ఇన్వెస్టర్‌కే లభిస్తాయి. 

⇒  గడువు ముగిసిన తర్వాత షేర్లు, ఫండ్స్‌ యూనిట్లపై రుణాన్ని పునరుద్ధరించుకోవచ్చు. 
⇒ రుణంపై వడ్డీ, అసలు చెల్లింపుల్లో విఫలమైతే తనఖాలో ఉంచిన సెక్యూరిటీలు, స్టాక్స్‌ను విక్రయించే అధికారం రుణం ఇచి్చన సంస్థలకు ఉంటుంది. విక్రయించగా వచి్చన మొత్తాన్ని రుణంతో సర్దుబాటు చేసుకుంటాయి. మిగులు ఉంటే రుణగ్రహీతకు చెల్లిస్తాయి. ఇంకా బకాయి మిగిలి ఉంటే రుణగ్రహీత నుంచి రాబట్టేందుకు తదుపరి చర్యలు తీసుకుంటాయి.

డెట్‌ ఫండ్స్‌పై వద్దు.. 
డెట్‌ ఫండ్స్‌లో రాబడులు 6–8 శాతం మధ్యే ఉంటాయి. వీటిపై రుణం తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ 10–12 శాతం మధ్య ఉంటుంది. దీనికి బదులు ఆ పెట్టుబడులను విక్రయించుకోవడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. కేవలం ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్‌పై రుణానికే పరిమితం కావాలి. ఎందుకంటే, ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్‌లో దీర్ఘకాలంలో రాబడులు 15 శాతం స్థాయిలో ఉంటాయి. కనుక వడ్డీ చెల్లింపులు పోను ఎంతో కొంత మిగులు ఉంటుంది. 

చార్జీలు.. 
సకాలంలో చెల్లింపులు చేయనప్పుడు పీనల్‌ చార్జీలు విధిస్తాయి. అలాగే, సెక్యూరిటీ ఇన్వొకేషన్‌ చార్జీ, కలెక్షన్‌ చార్జీ, లీగల్‌ చార్జీ, స్టాంప్‌ డ్యూటీ, చెక్‌ బౌన్స్‌ చార్జీలు కూడా ఉంటాయి. రుణ కాల పరిమితి సాధారణంగా ఒక ఏడాది ఉంటుంది. తర్వాత రెన్యువల్‌ చేసుకోవాలి. దీనిపైనా చార్జీలు విధిస్తాయి. రుణం తీసుకోవడానికి ముందే ఈ చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.  

ఇతర ఆప్షన్లు 
బంగారం, ప్రాపర్టీ (ఇల్లు లేదా స్థలం), జీవిత బీమా ఎండోమెంట్‌ ప్లాన్లపైనా సెక్యూర్డ్‌ రుణాలు పొందొచ్చు. కాకపోతే స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లపై డిజిటల్‌గా, వేగంగా రుణం లభిస్తుంది. కనుక ఇది అత్యవసర నిధిగానూ అక్కరకు వస్తుంది. తక్కువ రేటుకే రుణం తీసుకోవాలని భావిస్తే, భిన్న సంస్థల మధ్య వడ్డీ రేటును పరిశీలించాలి. అలాగే, బంగారం, జీవిత బీమా ప్లాన్లు ఉంటే వాటి రేట్లను విచారించి, చౌక మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణం చివరి ఎంపికగానే ఉండాలి.

విక్రయించడం మార్గం కాదు.. 
రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుండటం చూస్తున్నాం. ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారిలో 59 శాతం మంది 24 నెలలకు మించి కొనసాగిస్తున్నారు. మిగిలిన వారు ఆ లోపే విక్రయిస్తున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా చేయడం దీర్ఘకాల లక్ష్యాలకు విరుద్ధం.పెట్టుబడులు ఉపసంహరించుకోకుండా, ఓవర్‌డ్రాఫ్ట్‌ రుణ సదుపాయం ద్వారా స్వల్పకాల అవసరాలను అధిగమించడమే మంచి ఆప్షన్‌ అవుతుంది. మిరే అస్సెట్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ డేటా ప్రకారం.. ఫండ్స్, షేర్లపై రుణాలను 30 శాతం మంది వ్యాపార అవసరాల కోసం, 19 శాతం మంది ఇంటి నవీకరణ కోసం, 18 % మంది పిల్లల స్కూల్‌/కాలేజీ ఫీజుల కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఎస్‌బీఐ యోనో నుంచే.. 
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ సైతం మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లపై రుణం ఇస్తోంది. అది కూడా యోనో యాప్‌ నుంచే దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌గా రుణాన్ని పొందొచ్చు. క్యామ్స్‌ వద్ద నమోదైన అన్ని అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు) మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలపై, ఆకర్షణీయమైన రేట్లకే రుణాన్ని ఇస్తున్నట్టు ఎస్‌బీఐ చెబుతోంది. గతంలో కేవలం ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలపై, అది కూడా బ్యాంక్‌ శాఖకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు యోనో నుంచి పది నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రుణం విలువపై 0.50 శాతం ప్రాసెసింగ్‌చార్జీ, జీఎస్‌టీ చెల్లించుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement