
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు సవాళ్ల నుంచి గట్టెకేందుకు నగదు ముద్రణ సరికాదని ప్రముఖ ఆర్థికవేత్త పినాకి చక్రవర్తి స్పష్టం చేశారు. అలాంటి చర్య ద్రవ్య అస్థిరతకు దారితీస్తుందని విశ్లేషించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ తరహా నిర్ణయం తీసుకుంటుందని కూడా తాను భావించడం లేదన్నారు. ఈ మేరకు 1996లో కేంద్రం–ఆర్‌బీఐ మధ్య జరిగిన ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఇకముందు కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మూడవ వేవ్ లేకపోతే భారత్ ఆర్థిక రికవరీ వేగంగా ఉంటుందని చక్రవర్తి పేర్కొన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) డైరెక్టర్ కూడా అయిన చక్రవర్తి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ముఖ్యాంశాలు..
- పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గిస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు కూడా తీవ్రంగా పెరుగుతుందన్న విషయం పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్య నిర్వహణ విషయంలో ఇది చాలా క్లిష్టమైన అంశం.
- ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ద్రవ్యోల్బణం ఆందోళనకరం. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2 నుంచి 6 శాతం శ్రేణిలో ధరల స్పీడ్‌ను కట్టడి చేయాలి.
- కోవిడ్–19 మొదటి వేవ్‌తో పోల్చితే ప్రస్తుతం భారత్ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి.
- ఉపాధి అవకాశాల మెరుగుదలకు ఆర్థిక వ్యవస్థ పురోగతే కీలకం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు.
- ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకూ సామాన్యుని జీవన భద్రతకు కొన్ని ద్రవ్య పరమైన చర్యలు అవసరం.
- కరోనా సవాళ్ల నేపథ్యంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి.
- 2020–21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 9.5 శాతంకాగా, 2021–22లో ఈ లోటు 6.8 శాతం ఉంటుందని బడ్జెట్ అంచనావేసింది. అయితే ఇది మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment