‘ఎప్పుడు చూసినా మొబైల్‌లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్‌లైన్ గేముల ప్రత్యేకత.
కష్టపడకుండా ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడితే చాలు..గెలిస్తే డబ్బు లు మీసొంతం అంటూ యూజర్లను ఆకట్టుకుంటుండటంతో చిన్నా పెద్ద తేడా లేకుండా చాలా మంది ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడ్డారు. ఇందులో సంపాదించేది కొందరైతే .. నమ్మి డబ్బు పెట్టి నష్టపోయేవారు ఎందరో.. అటువంటి ఈ ఆన్ లైన్ గేమ్‌లపై అప్పట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ కూడా నిబంధనలు ప్రకటించింది. అయితే తాజాగా గేమింగ్ ఇండస్ట్రీ బాడీ ‘ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్)’ బాధ్యతాయుతమైన గేమింగ్‌ను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆటగాళ్ల రక్షణకు కట్టుబడి బాధ్యతయుతమైన గేమింగ్ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం, ఆటగాళ్లకు సురక్షితమైన వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకుంది. ఆన్‌లైన్‌లో ఆడుతున్నప్పుడు మంచి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా యువతకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: గూగుల్‌లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా?
భారత దేశంలోని మొదటి మూడు ఆన్‌లైన్ గేమింగ్ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ముంబైలో రెండు ఆన్‌లైన్ గేమింగ్ యునికార్న్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా, ఆన్లైన్ గేమింగ్‌లపై డాక్టర్లు స్పందిస్తూ బాధ్యతారహితమైన గేమింగ్ వల్ల ఏకాగ్రత తగ్గుతుందని, సులువుగా కోపం, చిరాకు పడడం, దీర్ఘకాలిక ఆందోళన , డిప్రెషన్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment