చెన్నై: ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఇది గత రెండేళ్లలో సగటున 108 శాతం మేర పెరిగింది. సీఐఈఎల్ హ్యూమన్ రిసోర్సెస్ సర్వీసెస్ అధ్యయన నివేదికలో ఈ అంశం వెల్లడైంది.
ఈవీ రంగంలో అత్యధికంగా ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాల కల్పన ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో ఆపరేషన్, సేల్స్, క్వాలిటీ అష్యురెన్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాలు ఉన్నాయి. సీఐఈఎల్ నిర్వహించిన ‘ఈవీ రంగంలో తాజా నియామకాల ధోరణులు – 2022‘ అధ్యయనంలో 52 కంపెనీలకు చెందిన 15,200 మంది ఉద్యోగు లు పాల్గొన్నారు.
‘ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడంపై భారత్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ప్రయత్నంలో నిలదొక్కుకుంటే 2030 నాటికి దేశీయంగా ఈవీ విభాగం పరిమాణం 206 బిలియన్ డాలర్లకు చేరుతుంది‘ అని సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. వృద్ధి ఇదే స్థాయిలో ఉంటే ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు కూడా భారీగానే ఉండగలవని ఆయన పేర్కొన్నారు.
నివేదికలో మరిన్ని విశేషాలు ..
♦ఎలక్ట్రిక్ వాహనాల విభాగం నియామకాల్లో 62 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూఢిల్లీ (12 శాతం), పుణె (9 శాతం), కోయంబత్తూర్ (6 శాతం), చెన్నై (3 శాతం) ఉన్నాయి.
♦ గడిచిన ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు 2,236 మంది ఉద్యోగులను తీసుకున్నాయి.
♦కంపెనీల్లోని అన్ని విభాగాల్లోనూ మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తోంది. కైనెటిక్ గ్రీన్, మహీంద్రా ఎలక్ట్రిక్, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్, ఓబీఈఎన్ ఎలక్ట్రిక్, యాంపియర్ వెహికల్స్ సంస్థల్లో టాప్ మేనేజ్‌మెంట్ స్థానాల్లో కూడా మహిళలు ఉన్నారు. తమిళనాడులోని రాణిపేట్‌లో ఉన్న ఓలా ఈ–స్కూటర్ ఫ్యాక్టరీని మొత్తం మహిళలే నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment