న్యూఢిల్లీ: టెస్లా సీఈఓ ఈలాన్ మస్క్‌కు సంబంధించి ఒక న్యూస్ సెన్సేషనల్‌గా మారింది. తన సంస్థలో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటవ్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చాడట. 2021 నవంబరులో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ న్యూరాలింక్ టాప్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో కలిసి కవల పిల్లలకు జన్మనిచ్చారనేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు కోర్టు పత్రాలను ధృవీకరిస్తూ పలు నివేదికలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో మస్క్ సంతానం తొమ్మది మందికి చేరింది.
ఇన్‌సైడర్ రిపోర్ట్ ప్రకారం మస్క్, జిలిస్ జంట తమ కవల పిల్లల ఇంటి పేర్లను మార్చాల్సిందిగా టెక్సాస్‌లో కోర్టులో ఏప్రిల్ 2022లో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ఎక్కుమంది పిల్లల్ని కనాలని ఇటీవల వ్యాఖ్యానించిన మస్క్‌కు పిల్లలంటే అంత పిచ్చా అని నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు.
మస్క్‌కు చెందిన స్టార్టప్ న్యూరాలింక్‌లో 2017లో జిలిస్ చేరారు. దీనికితోడు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ డీల్ విజయవంతమైన తరువాత ట్విటర్ బాధ్యతలను ఆమెకు అప్పగించాలని మస్క్ ఆలోచిస్తున్నాడట.
మొదటి భార్య జస్టిన్, మస్క్ జంటకు ఆరుగురు పిల్లలు. అయితే ఈ ఆరుగురిలో, 10 నెలల కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. మస్క్‌కు కెనెడియన్ సింగర్ గ్రిమ్స్ (క్లైర్ బౌచర్)తో కలిసి మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందులో రెండో బిడ్డను సరోగసీ ద్వారా పొందారు.
కాగా గతంలో మస్క్ ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలన్న కోరిక వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది పిల్లలు లేకపోతే, నాగరికత కూలిపోతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఫాదర్స్ డే సందర్భంగా, మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె (అలెగ్జాండర్ జేవియర్ మస్క్) తన పేరును మార్చుకునేందుకు పిటిషన్ దాఖలు చేసింది. 2008లో మస్క్‌కి విడాకులు ఇచ్చిన విల్సన్‌ను తల్లిగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment