వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్‌ వడ్డీ! | EPFO may cut interest rate | Sakshi
Sakshi News home page

EPFO:వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్‌ వడ్డీ!

Published Sun, Sep 17 2023 10:14 PM | Last Updated on Sun, Sep 17 2023 10:33 PM

EPFO may cut interest rate - Sakshi

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPF)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు చేదువార్త. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగుల భవిష్యనిధిపై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించిందని ఆర్టీఐ సమాచారం ఆధారంగా ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓ ​​మిగులును అంచనా వేసిన తర్వాత కూడా నష్టాన్ని చవిచూసింది. రూ. 449.34 కోట్ల మిగులు ఉంటుందని అనుకున్నప్పటికీ రూ. 197.72 కోట్ల లోటును ఎదుర్కొంది. దీంతో పీఎఫ్‌పై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈపీఎఫ్‌ఓ 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. అయితే నష్టాలను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ రేటును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. పీఎఫ్‌పై అధిక వడ్డీ రేట్లను తగ్గించి మార్కెట్ రేట్లతో సమానంగా తీసుకురావాల్సిన అవసరం ఉందంది. ప్రస్తుతం పీఎఫ్‌పై వచ్చే వడ్డీని మార్కెట్‌తో పోల్చితే కాస్త ఎక్కువే. చాలా పొదుపు పథకాల్లో వడ్డీ పీఎఫ్‌పై చెల్లించే వడ్డీ కంటే తక్కువగానే ఉంది.ఈ కారణంగానే పీఎఫ్ వడ్డీని 8 శాతం దిగువకు తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చాలా కాలంగా వాదిస్తోంది.

దీంతో పీఎఫ్‌పై వడ్డీని ఎప్పకప్పుడు తగ్గిస్తూ వస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ రేటును 8.80 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గించారు. కార్మిక సంఘాల నిరసనతో మళ్లీ 8.80 శాతానికి పెంచారు. ఆ తర్వాత పీఎఫ్‌పై వడ్డీ రేట్లు తగ్గుతూ 2021-22లో 8.10 శాతానికి తగ్గాయి. 2022-23లో ఇది 8.15 శాతానికి స్వల్పంగా పెరిగింది. కోట్లాది మంది ఉద్యోగుల సామాజిక భద్రతకు పీఎఫ్ అతిపెద్ద ఆధారం. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ చందాదారుల సంఖ్య 6 కోట్లకు పైగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement