న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికరంగా రూ.39,927 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతక్రితం జూన్ త్రైమాసికంలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.19,508 కోట్లుగానే ఉన్నాయి. నూతన పథకాల ఆవిష్కరణ (ఎన్‌ఎఫ్‌వోలు), సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు స్థిరంగా ఉండడం ఇందుకు మేలు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే.. సెప్టెంబర్ ఆఖరుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.12.8 లక్షల కోట్లుగా ఉంది.
జూన్ చివరికి ఈ మొత్తం రూ.11.1 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లగా.. ఈ ఏడాది మార్చి నుంచి నికరంగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈక్విటీ పథకాల్లోకి వచ్చే నికర పెట్టుబడుల్లో 50 శాతం ఎన్‌ఎఫ్‌వోల నుంచే ఉంటున్నట్టు పరిశ్రమకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీల్లో ఫ్లెక్సీక్యాప్ విభాగం అత్యధికంగా రూ.18,258 కోట్లను ఆకర్షించగా.. సెక్టోరల్ ఫండ్స్ రూ.10,232 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.4,197 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.3,716 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.3,000 కోట్ల చొప్పున సెప్టెంబర్ క్వార్టర్‌లో నికరంగా పెట్టుబడులు ఆకర్షించాయని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ డేటా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment