స్టాక్ మార్కెట్ అంటేనే ఒడిదుడుకుల సహజం. పెట్టుబడి పెట్టిన స్టాక్‌లకు సంబంధించి, సెబీ, ఆర్‌బీఐ, ప్రభుత్వం.. తీసుకునే నిర్ణయాలకు సంబంధించి చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో మార్కెట్లు స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది.. మరోరోజు తిరిగి గరిష్ఠ స్థాయికి చేరుతుంది. మార్కెట్‌లో నిత్యం పెరిగే స్టాక్‌లు ఉండవు. ఎంత మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ షేర్ అయినాసరే ఎప్పుడోఒకప్పుడు పడిపోవాల్సిందే.
ఇటీవల మధ్య, చిన్న స్థాయి షేర్ల ధరలు బుడగల్లా పెరుగుతూ వస్తున్నాయని, ఇవి ఏమాత్రం సహేతుకంగా కనిపించడం లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అభిప్రాయం వ్యక్తం చేసింది. చిన్న మదుపరులు పెట్టుబడులు పెట్టే ముందు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో అనుసరించాల్సిన మార్గాలేమిటో నిపుణులు తెలియజేస్తున్నారు.
ఆందోళనతో నష్టాలు..
మార్కెట్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అస్థిర మార్కెట్‌లో ఎన్నో భయాందోళనలు ఉంటాయి. వదంతులు వస్తుంటాయి. వీటన్నింటి ఆధారంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఆందోళనలకు గురిచేసే విశ్లేషణలు, సలహాలతో చాలామంది తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, నష్టపోవడం చూస్తూనే ఉంటారు. మార్కెట్లు తిరిగి కోలుకున్నప్పుడు రాబడి ఆర్జించే అవకాశాలు కోల్పోతారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలాంటివి మీ దగ్గరున్న నగదు నిల్వల విలువను తగ్గిస్తాయి. పెట్టుబడుల రూపంలో ఉన్నప్పుడే మంచి ఫలితాలు రాబట్టుకోగలం. పెట్టుబడుల విలువ తగ్గిపోగానే ఆందోళన చెందడం కాదు. మీరు తెలుసుకుంటున్న సమాచారం ఎంత మేరకు సరైనదో చూసుకోండి. మార్కెట్లు పడిపోతున్నప్పుడు పెట్టుబడుల విలువ తగ్గడం సహజమేననే వాస్తవాన్ని అంగీకరించాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి.
దీర్ఘకాలంలో అధిక రాబడి
దీర్ఘకాల లక్ష్యాలతో మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధికమొత్తంలో రాబడి అందుతుంది. చాలా మంది మొదట లాంగ్‌టర్మ్ కోసమనే మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇతర కారణాల వల్ల స్వల్పకాలంలోనే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకుంటారు. దాంతో నష్టమే కలుగుతుంది. పెట్టుబడులు ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. వాటిని సాధించే వరకూ మదుపు సాగుతూనే ఉండాలి. మధ్యలోనే వదిలేయొద్దు.
నష్టాన్ని పరిమితం చేసేలా..
మార్కెట్‌లో నష్టం రావడం సాధారణం. అలాఅని తీవ్ర నష్టాల్లోకి వెళ్లే వరకు పెట్టుబడులను కొనసాగించకూడదు. ఫలానా నష్టం వరకు భరించేలా స్టాప్‌లాస్‌ను ఉంచుకోవాలి. నష్టభయాన్ని పరిమితం చేసుకునేందుకు ప్రయత్నించాలి. పెట్టుబడులు ఒకే చోట కాకుండా.. పలు పథకాలకు కేటాయించాలి. నష్టభయం అధికంగా ఉంటూ, ఎక్కువ రాబడినిచ్చే పథకాల్లో కొంత, సురక్షిత పథకాల్లో కొంత మొత్తం మదుపు చేయాలి. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులే కాకుండా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల వంటి స్థిరాదాయ పథకాలనూ ఎంచుకోవాలి.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో..
మార్కెట్ పతనం మంచి అవకాశం
మంచి యాజమాన్యం, పనితీరు బాగున్న సంస్థల షేర్లు పతనం సమయంలో అందుబాటు ధరలోకి వస్తాయి. ఇలాంటి వాటిని ఎంచుకొని, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయాలి. మార్కెట్లు మళ్లీ పెరుగుతున్నప్పుడు ఇవి మంచి లాభాలను పంచే అవకాశం లేకపోలేదు. మంచి షేర్లను అవకాశాన్ని బట్టి యావరేజ్ చేసుకోవచ్చు. నష్టభయాన్ని ఎంత మేరకు భరించగలరో చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment