ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు జోరందుకోవడంతో వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. అయితే కోవిడ్-19 విసురుతున్న సవాళ్లనుంచి నిరుద్యోగులకు దన్నునిచ్చేందుకు ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై డెమక్రాట్లు, రిపబ్లికన్లమధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం! ఈ నేపథ్యంలో శుక్రవారం డోజోన్స్ 115 పాయింట్లు(0.5 శాతం) లాభపడి 26,428కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 25 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,271 వద్ద ముగిసింది. నాస్‌డాక్ మరింత అధికంగా 157 పాయింట్లు(1.5 శాతం) పురోగమించి 10,745 వద్ద స్థిరపడింది.
జులైలో జూమ్
జులైలో డోజోన్స్ 2.4 శాతం లాభపడగా.. ఎస్‌అండ్‌పీ 5.5 శాతం ఎగసింది. ఇక నాస్‌డాక్ మరింత స్పీడుతో దాదాపు 7 శాతం జంప్‌చేసింది. గత వారంలోనే నాస్‌డాక్ 3.7 శాతం బలపడటం విశేషం!
ఫాంగ్ స్టాక్స్ జోరు
ఏప్రిల్- జూన్‌లో పటిష్ట ఫలితాలు సాధించడంతో ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ షేరు 10.5 శాతం దూసుకెళ్లింది. 425 డాలర్లను అధిగమించింది. దీంతో కంపనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఒక్క రోజులోనే 172 బిలియన్ డాలర్లు జంప్‌చేసింది. 1.81 లక్షల కోట్ల డాలర్లను తాకింది. తద్వారా చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో(1.76 ట్రిలియన్ డాలర్లు)ను వెనక్కినెట్టింది. ఈ బాటలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 8.2 శాతం జంప్‌చేసి 254 డాలర్ల సమీపంలో నిలిచింది. ఇదే విధంగా అమెజాన్ 3.7 శాతం ఎగసి 3165 డాలర్లకు చేరింది. అయితే ప్రకటనలు పుంజుకున్నప్పటికీ 16 ఏళ్లలో తొలిసారి.. ఒక త్రైమాసికంలో మొత్తం ఆదాయం క్షీణించడంతో అల్ఫాబెట్ షేరు 3.2 శాతం నష్టపోయింది. 1483 డాలర్ల వద్ద ముగిసింది. కాగా.. కేటర్‌పిల్లర్ 2.8 శాతం క్షీణించి 133 డాలర్లకు చేరగా.. షెవ్రాన్ 2.7 శాతం నష్టంతో 84 డాలర్ల వద్ద నిలిచింది.
ఆసియా అటూఇటూ
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో జపాన్ 2 శాతం, చైనా 1 శాతం చొప్పున ఎగశాయి. ఇండొనేసియా దాదాపు 3 శాతం పతనమైంది. ఇతర మార్కెట్లలో సింగపూర్, తైవాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్ 1.4-1 శాతం మధ్య క్షీణించగా.. కొరియా నామమాత్ర నష్టంతో కదులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment