కోవిడ్-19 భయాలతో ఈ ఏడాది మార్చిలో కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల దౌడు తీస్తున్నాయి. దేశీయంగా సెన్సెక్స్ 38,000 పాయింట్ల మైలురాయి అందుకుంది. ఇందుకు ప్రధానంగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) దోహదం చేసింది. అయితే యూఎస్ మార్కెట్లు మరింత దూకుడు చూపుతున్నాయి. ఏప్రిల్ నుంచి నాస్‌డాక్ పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ వస్తోంది. ఈ బాటలో ప్రధాన ఇండెక్సులు డోజోన్స్, ఎస్‌అండ్‌పీ సైతం రికార్డ్ గరిష్టాలకు చేరువయ్యాయి. ఇందుకు FANMAG స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లు సహకరిస్తున్న విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం..
యమ స్పీడ్
FANMAG స్టాక్స్‌గా పిలిచే గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్.. కొద్ది రోజులుగా జోరు చూపుతున్నాయి. మార్చి కనిష్టాల నుంచి చూస్తే 128 శాతం స్థాయిలో ఎగశాయి. అయితే వీటిలో గూగుల్, మైక్రోసాఫ్ట్ 60 శాతం స్థాయిలో లాభపడ్డాయి. ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ అయితే 750 శాతం దూసుకెళ్లింది. దీంతో అమెరికా మార్కెట్లు బలపడగా.. ఇదే సమయంలో దేశీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 140 శాతం జంప్‌చేసింది. దీంతో సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌లను దాటాయి.
భారీ విలువ
అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన FANMAG.. గ్లోబల్ కంపెనీలు కావడంతో వీటి సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ 7.2 ట్రిలియన్ డాలర్లను తాకాయి. ఇక బీఎస్‌ఈ మొత్తం మార్కెట్ విలువ 2.4 ట్రిలియన్ డాలర్లస్థాయికి చేరింది. అంటే బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్‌తో చూస్తే FANMAG మార్కెట్ విలువ మూడు రెట్లు అధికం. కాగా.. ఇటీవల ఈ స్టాక్స్‌లో వస్తున్న ర్యాలీ కారణంగా పలువురు ఇన్వెస్టర్లు వీటిలో ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలియజేశాయి. ఇందుకు వీలుగా బ్రోకింగ్ సంస్థలు సైతం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
అవకాశాలు ఇలా
ప్రస్తుతం సంపన్నులు, మధ్యస్థాయి వర్గాలు అధికంగా యూఎస్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలియజేశాయి. దీంతో విదేశీ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసే ప్రక్రియ దేశీయంగా ఊపందుకోలేదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ పేర్కొన్నారు. చిన్న ఇన్వెస్టర్లు యూఎస్ ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయడం అంత సులభంకాదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ మార్గంలో అంతర్జాతీయ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఇందుకు వీలున్నట్లు తెలియజేశారు. పీపీఎఫ్‌ఏఎస్ దీర్ఘకాలిక ఈక్విటీ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఎస్‌అండ్‌పీ-500 ఫండ్ వంటి అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. విదేశీ ఈక్విటీలలో అయితే పలు రంగాలు, కంపెనీల ద్వారా భారీ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలున్నప్పటికీ అత్యధిక రిస్కులను ఎదుర్కోవలసి ఉంటుందని విశ్లేషకులు వివరించారు. డాలరు- రూపాయి మారకం విలువ, సామాజిక, రాజకీయ అంశాలు వంటివి ప్రభావం చూపుతుంటాయని తెలియజేశారు. తగినంత రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం భారీ నష్టాలకు దారితీయవచ్చని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లలో కనిపిస్తున్న బుల్‌ట్రెండ్ కారణంగా భారీ ఆటుపోట్లకు వీలున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment