
Central Government Employees Facilities Will Be Removed From November 8: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సైతం దశలవారీగా అన్‌లాక్ చేస్తుంది.ఇక ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా కేంద్రం 'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే నవంబర్ 8 నుంచి కరోనా కారణంగా ఉద్యోగులకు అందించిన సౌకర్యాలన్నీ తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్ కుమార్ భాటియా తెలిపారు.
కేంద్రప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కరోనా మహమ్మారి కారణంగా కార్యాలయాలకు తక్కువ సంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వహించినట్లు తెలిపారు. తక్కువ సంఖ్యలో ఉద్యోగులతో పాటు పనిగంటల్ని తగ్గించినట్లు తెలిపారు. అయితే నవంబర్ 8నుంచి ఈ సౌకర్యాల్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు కొత్త నిబంధనల్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల్లో జారీ చేసిన మార్గదర్శకాలు:
►బయోమెట్రిక్ యంత్రం దగ్గర తప్పనిసరిగా శానిటైజర్ ఉండాలి
►ఉద్యోగులందరూ హాజరు నమోదుకు ముందు, తర్వాత చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి
► బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేటప్పుడు ఉద్యోగులు తమ మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలి
► ఉద్యోగులందరూ ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి లేదా ఫేస్ కవరింగ్ ధరించాలి
► బయోమెట్రిక్ మిషన్ టచ్‌ప్యాడ్‌ను తరచుగా శుభ్రం చేయడానికి నియమించబడిన సిబ్బందిని నియమించాలి
► బయోమెట్రిక్ యంత్రాలను బహిరంగ వాతావరణంలో ఉంచాలి.
► యంత్రం లోపల ఉంటే, తగినంత సహజ వెంటిలేషన్ ఉండాలి.