
మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. సెన్సెక్స్ 422 పాయింట్లు పతనమై 38,071 వద్ద నిలవగా.. నిఫ్టీ 98 పాయింట్లు క్షీణించి 11,203 వద్ద ముగిసింది. విదేశీ సంకేతాలు అటూఇటుగా ఉన్న నేపథ్యంలో తొలి నుంచీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,617 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,884 వద్ద కనిష్టాన్నీ చేరింది. ఇక నిఫ్టీ 11,351-11,150 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. మరోపక్క దేశీయంగా గురువారం జులై డెరివేటివ్ సిరీస్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.
ఆటో, ఐటీ డీలా-
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా 3 శాతం ఎగసింది. ఇతర రంగాలలో పీఎస్‌యూ బ్యాంక్స్ 1.5 శాతం, మెటల్ 0.9 శాతం చొప్పున బలపడగా.. ఆటో, ఐటీ 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ 6.3 శాతం జంప్‌చేసింది. క్యూ1 ఫలితాలతో ఇంట్రాడేలో రూ. 4336 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో టాటా స్టీల్, ఇండస్‌ఇండ్, గ్రాసిమ్, ఇన్‌ఫ్రాటెల్, యూపీఎల్, సిప్లా, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గెయిల్, ఐషర్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ 4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఆర్‌ఐఎల్ 4 శాతం పతనంకాగా.. ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీపీసీఎల్, మారుతీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టైటన్, ఇన్ఫోసిస్, జీ 2.7-1 శాతం మధ్య క్షీణించాయి.
ఎన్‌ఐఐటీ టెక్ స్పీడ్
డెరివేటివ్ కౌంటర్లలో ఎన్‌ఐఐటీ టెక్, ఎస్‌ఆర్‌ఎఫ్, టొరంట్ ఫార్మా, శ్రీరామ్ ట్రాన్స్, కాల్గేట్ పామోలివ్, టాటా కెమ్, పెట్రోనెట్, టాటా కన్జూమర్ 5-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. జీఎంఆర్, పిరమల్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఈక్విటాస్, హెచ్‌పీసీఎల్, మణప్పురం, అమరరాజా 4-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1371 లాభపడగా.. 1329 నష్టపోయాయి.
డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 246 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 453 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 978 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.