
కోల్‌కతా: వృద్ధి వ్యూహంలో భాగంగా తాము ఫిన్‌టెక్ కంపెనీలతో జట్టు కట్టనున్నట్టు ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ ప్రకటించారు. టాప్–5 బ్యాంకుల్లో ఒకటిగా అవతరించడమే తమ లక్ష్యమన్నారు. ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యంతో తాము పెద్ద సంఖ్యలో కస్టమర్లను చేరుకోగలమన్నారు. ఫిన్‌టెక్ కంపెనీలతో పోటీ పడడం కంటే, వాటి సహకారానికే తాము ప్రాధాన్యమిస్తామని చెప్పారు. బ్యాంక్ అంతర్గత వృద్ధి వ్యూహంలో ఇది భాగమన్నారు.
ఫిన్‌టెక్‌లు బ్యాంక్‌కు గణనీయమైన విలువను తెచ్చి పెడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కొత్త ఖాతాల ప్రారంభం దిశగా కస్టమర్లను సొంతం చేసుకోవడానికి ఫిన్‌టెక్ కంపెనీలు సాయపడతాయి. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ రోజూ 15,000 కొత్త ఖాతాలను తెరుస్తోంది. ఇందులో 60 శాతం ఫిన్‌టెక్ సంస్థల ద్వారానే వస్తున్నాయి. ఇవన్నీ డిజిటల్ ఖాతాలు’’అని చెప్పారు. ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా రుణాల మంజూరు అన్నది ప్రధానంగా క్రెడిట్ కార్డుల రూపంలో ఉంటున్నట్టు తెలిపారు.
సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల మధ్య సమతుల్యాన్ని పాటిస్తూ, సొంతంగానే తాము వృద్ధిని సాధించగలమన్నారు. ‘‘మా పోర్ట్‌ఫోలియోలో 3 శాతం మేర క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాల రూపంలో అన్‌సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి. ఉత్పత్తులు, విభాగాలు, ప్రాంతాల వారీగా వైవిధ్యం పాటించాలన్నది మా విధానం’’అని శ్రీనివాసన్ వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు రుణ వితరణకు సబంధించి గ్రీన్ బ్యాంకింగ్‌పైనా తాము దృష్టి సారించినట్టు చెప్పారు.
శాఖల విస్తరణ
దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను తెరిచే ప్రణాళికతో ఉన్నట్టు శ్రీనివాసన్ ప్రకటించారు.‘‘ప్రస్తుతం మాకు 1408 శాఖలు ఉన్నాయి. 2024 జనవరి నుంచి 2025 మధ్య నాటికి మరో 250 శాఖలను తెరవాలన్నది ప్రణాళిక’’అని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ శాఖల విస్తరణ చేపడతామన్నారు. ఏటా 100 నుంచి 150 శాఖలు తెరవాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment