న్యూఢిల్లీ: కార్ల రిటైల్ మార్కెట్లో డిస్కౌంట్ల పండగ నడుస్తోంది. మునుపెన్నడూ లేనంతగా కార్లపై తగ్గింపు ఉండడం గమనార్హం. 2023 ఆగస్ట్‌తో పోలిస్తే డిస్కౌంట్లు రెండింతలు అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. విక్రయాలు మందగించడంతో కంపెనీలు, డీలర్‌షిప్ కేంద్రాల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. వీటిని క్లియర్ చేసుకోవడంలో భాగంగా కంపెనీలు, డీలర్లు డిస్కౌంట్ల బాట పట్టారు. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ మొదలుకుని హ్యుండై, టాటా మోటార్స్, స్కోడా, హోండా డిస్కౌంట్ల పోటీలో నిలిచాయి.
నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పాపులర్ మోడళ్లకూ వీటిని వర్తింపజేస్తుండడం విశేషం. ఆఫర్స్, ప్రయోజనాలు మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.25,000, గ్రాండ్ విటారాపై రూ.1,28,000 వరకు అందిస్తోంది. హ్యుండై ఎక్స్‌టర్‌పై రూ.40,000, ఆల్కజార్‌పై రూ.90,000 వరకు, టాటా మోటార్స్ నెక్సన్ రూ.16,000–1,00,000, హ్యారియర్‌పై రూ.1,20,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. హోండా ఎలివేట్‌పై రూ.80,000 వరకు ఆఫర్స్, ప్రయోజనాలు ఉన్నాయి.
భారీగా కార్ల నిల్వలు..
2019–20 తర్వాత అధిక డిస్కౌంట్లు ప్రస్తుతం ఉన్నాయని పరిశ్రమ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ స్టేజ్–6 ఉద్గార ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిల్వలను క్లియర్ చేసుకోవడానికి 2019–20లో మార్కెట్లో డిస్కౌంట్ల జోరు కొనసాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కార్ల నిల్వలు సుమారు 3,00,000 యూనిట్ల స్థాయిలో నమోదయ్యాయి. 30 రోజుల డిమాండ్‌కు ఇవి సరిపోతాయి. అయితే అమ్మకాలు మందగించడంతో కొద్దిరోజుల్లోనే నిల్వలకు మరో 1,00,000 యూనిట్లు తోడయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్ల తయారీ కంపెనీలు, డీలర్లు డిస్కౌంట్లకు తెరలేపారు. 2019–20 స్థాయిలో తగ్గింపులు ఉన్నాయని పరిశ్రమ చెబుతోంది. 2023–24లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధిక స్థాయిలో 42.3 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. సెమికండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, డిమాండ్ కొనసాగడం ఈ జోరుకు కారణమైంది. మూడేళ్లు పరుగుపెట్టిన ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు మందగించడం ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment