Ford Ends Production units In India భారతీయులు ఎక్కువ ఇష్టపడే కార్లు జాబితా తీస్తే అందులో తప్పకుండా ఫోర్డ్ కూడా ఉంటుంది. ఈ అమెరికన్ కంపెనీ భారత్ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంది. అయితే భారీ నష్టాలు కారణంగా ఈ సంస్థ దేశం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా సుమారు 2 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూశామని కంపెనీ వెల్లడించింది.
ఫోర్డ్‌కు భారతదేశంలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో ఉండగా, మరొకటి తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంది. సనంద్ ప్లాంట్ నుంచి, ఫోర్డ్ వారి ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్ వంటి చిన్న కార్లను ఉత్పత్తి చేసేది. చెన్నై ప్లాంట్ నుంచి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఎండీవర్‌లను ఉత్పత్తి చేస్తుంది. 9 సెప్టెంబర్ 2021న ఫోర్డ్ కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగానే సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తిని అక్టోబర్ 2021లో నిలిపివేసింది.
కార్లు, ఇంజిన్లు ఎగుమతి ప్రయోజనాల కోసం చెన్నై ప్లాంట్‌ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం చెన్నై యూనిట్‌ని కూడా నిలిపివేయడంతో దేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసినట్లైంది. ఎకోస్పోర్ట్ ఫోర్డ్‌కు ఆటోమొబైల్ రంగంలో మంచి గుర్తింపును తీసుకొచ్చిందనే చెప్పాలి. దీని తర్వాత మార్కెట్లో ఇతర కార్లకు గట్టి పోటిని కూడా ఇవ్వగలిగింది ఫోర్డ్. అయితే కంపెనీ తీసుకొచ్చిన కొత్త డిజైన్ కార్లు మార్కెట్లో ఆశించినంతగా క్లిక్ కాలేదు. చివరికి, ఫోర్డ్‌కు భారీ నష్టాలు రావడంతో దేశం నుంచి నిష్క్రమించడం తప్ప వేరే మార్గం కనపడలేదు.
చదవండి: Reliance Industries: ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment