మల్టీక్యాప్ ఎన్‌ఎఫ్‌వోల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? మల్టీక్యాప్ పేరుతో కొత్తగా వస్తున్న ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?– ఆశిష్
ఈ తరహా పథకాల నుంచి అర్థవంతమైన రాబడులు అందుకోగలమా? అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం ఉంది. నేడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుసరిస్తున్న పెట్టుబడుల విధానాన్ని గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పాటించాయి. వాటిపై ఎటువంటి నియంత్రణలు లేవు. కనుక మార్కెట్ క్యాప్ పరిమితితో సంబంధం లేకుండా ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ కొద్దీ ఇన్వెస్ట్ చేసుకునేవారు. దీంతో వాటి విధానం మార్చే దిశగా సెబీ మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇప్పుడు మల్టీక్యాప్ ఫండ్స్ కచ్చితంగా 25 శాతం చొప్పున లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. చాలా వరకు మల్టీక్యాప్ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల పెరంగా పెద్దగా మారిపోయాయి. దీంతో 25 శాతం చొప్పున ప్రతీ విభాగంలో పెట్టుబడులు కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలన్నది వాటికి ప్రతిబంధకమే. ఎందుకంటే భారీ పెట్టుబడులకు తగ్గ అవకాశాలు స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ విభాగంలో అన్ని వేళలా ఉండాలని లేదు. దీంతో వాటి నుంచి ఆందోళన వ్యక్తం అయింది. పరిశ్రమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సెబీ మార్కెట్‌కు ఇది ప్రతికూలంగా మారుతుందని గుర్తించింది. దీంతో ఫ్లెక్సీక్యాప్ పేరుతో మరో విభాగాన్ని తీసుకొచ్చింది. 25% చొప్పున కచ్ఛితంగా ప్రతీ విభాగంలో ఇన్వెస్ట్ చేయడం వీలు కాకపోతే మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ వెసులుబాటునిచ్చింది. దీంతో చాలా మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయాయి. కొత్త పథకం ఆవిష్కరించడం ద్వారా మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించొచ్చని మ్యూచువల్ ఫండ్ సంస్థలు భావించాయి. ఒక్కో విభాగంలో ఒక్క పథకమే ఉండాలన్నది సెబీ నిబంధన. దీంతో మల్టీక్యాప్ నుంచి ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయిన ఫండ్స్ సంస్థలు.. ఇప్పుడు మల్టీక్యాప్ విభాగంలో కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రకటిస్తున్నాయి. కనుక అవి తమకు అనుకూలమా? కాదా? అని ఇన్వెస్టర్లు ప్రశ్నించుకోవాలి. మల్టీక్యాప్ పథకాలు వాటి పనితీరును నిరూపించుకోవాల్సి ఉంది. వీటిల్లో ఆరంభంలో ఇన్వెస్ట్ చేయకపోతే పెద్దగా కోల్పోయేదేమీ ఉండదు. దూరంగా ఉండొచ్చు.
మంచి ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక ఎలా? – శశాంక్
ఎక్స్‌పెన్స్ రేషియో చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్‌లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది. కొంత ట్రాకింగ్ లోపం ఉండే అవకాశం లేకపోలేదు. ఎక్స్‌పెన్స్ రేషియోను పరిశీలించడం కీలకమన్నది గమనించండి.
మూడేళ్లలో రూ.10 లక్షలు సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. పెట్టుబడి మొత్తంలో 60 శాతాన్ని ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు, 40 శాతాన్ని లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చా? – అంకిత్
రాజీపడలేని లక్ష్యం కోసం అయితే ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడేళ్ల కాలం అన్నది ఈక్విటీ పెట్టుబడులకు సరిపోదు. ఎందుకంటే అంత స్వల్పకాలంలో ఈక్విటీ మార్కెట్ తీరు ఎలా ఉంటుందన్నది ఎవరూ చెప్పలేరు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మూడేళ్ల కాలం ఇన్వెస్ట్ చేసినా, నష్టపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎవరైనా ఒకరు ప్రతినెలా రూ.10,000 చొప్పున మూడేళ్లకాలంలో రూ.3.6 లక్షలను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చూస్తూ వెళితే చివర్లో ఆ మొత్తం విలువ రూ.2.5 లక్షలుగానే ఉండొచ్చు. ఒకవేళ రిస్క్ తీసుకునే అవకాశం ఉండి, వచ్చే మూడేళ్లలో ఈక్విటీలు మంచి రాబడులను ఇస్తాయన్న నమ్మకం మీకు ఉంటే అప్పుడు మూడేళ్లకోసం అయినా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులు ఏవైనా కనీసం ఐదేళ్ల పాటు వేచి చూడగలనన్న సన్నద్ధతతో ఉండాలి.
- ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్)
Comments
Please login to add a commentAdd a comment