న్యూఢిల్లీ: పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, రెన్యూవబుల్స్ విభాగాలలో విస్తరణపై దృష్టి పెట్టినట్లు పీఎస్‌యూ దిగ్గజం గెయిల్ ఇండియా చైర్మన్ మనోజ్ జైన్ తాజాగా పేర్కొన్నారు. సహజవాయువు కాకుండా ఇతర విభాగాలలో బిజినెస్‌ను విస్తరించే కొత్త ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ‘2030 వ్యూహాలు’ పేరుతో మెరుగుపరచిన భవిష్యత్ ప్రణాళికలను అనుసరించనున్నట్లు వివరించారు. వచ్చే దశాబ్దానికిగాను సరికొత్త ప్రయాణాన్ని సాగించనున్నట్లు తెలియజేశారు.
పరిశ్రమలో వస్తున్న మార్పులు, తద్వారా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ వ్యూహాలు సహకరించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా కొత్త విభాగాలలో విస్తరణ, వృద్ధికి దోహదం చేయగలవని అభిప్రాయపడ్డారు. కంపెనీ దేశీయంగా 70 శాతం గ్యాస్‌ను 13,340 కిలోమీటర్ల పరిధిలో గల ట్రంక్ పైప్‌లైన్ ద్వారా వివిధ ప్రాంతాలకు రవాణా చేసే సంగతి తెలిసిందే. దేశీయంగా మొత్తం సహజవాయువు అమ్మకాల్లో 55 శాతం వాటా కంపెనీదే. 17.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
రూ. 8,800 కోట్లు
మహారాష్ట్ర రాయిగఢ్ జిల్లాలోని ఉసార్‌లోగల ఎల్‌పీజీ ప్లాంటును పాలీప్రొపిలీన్ కాంప్లెక్స్‌గా మార్పిడి చేస్తోంది. ఇందుకు రూ. 8,800 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. తద్వారా 2022–23కల్లా 5 లక్షల టన్నుల తయారీ సామర్థ్యాన్ని అందుకోనుంది. దీనిలో భాగంగా పాలీఎథిలీన్, పాలీప్రొపిలీన్‌లకు భవిష్యత్‌లో పెరగనున్న డిమాండును అందుకునే అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇక మరోవైపు కంపెనీకి గల 120 మెగావాట్ల పవన, సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాలను 1 గివావాట్‌కు పెంచుకునే ప్రణాళికలు వేసింది.
ఇందుకు రానున్న మూడు, నాలుగేళ్లలో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇతర రంగాలలో విస్తరిస్తున్నప్పటికీ గ్యాస్ బిజినెస్ కీలక విభాగంగా నిలవనున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. వెరసి జాతీయ గ్యాస్ గ్రిడ్‌లో భాగంగా ప్రాధాన్యతగల సెక్షన్ల ఏర్పాటుకు రూ. 32,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలియజేశారు. 7,500 కిలోమీటర్లమేర ఏర్పాటు చేయనున్న లైన్లలో దేశ తూర్పు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment