ముంబై: దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం ప్రపంచ పరిణా మాలు, విదేశీ పెట్టుబడుల సరళీ స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నా రు. ‘‘దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్, మార్జిన్లపై యాజమాన్యపు వ్యాఖ్యలు, ప్రభుత్వ మూల ధన వ్యయం, గ్రామీణ వృద్ధి తది తర అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల కదలికలు, ఆర్థిక వృద్ధి, సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధాన నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌పై ప్రభావం చేయవచ్చు.
అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 17,450 వద్ద తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోయితే 17,250–17, 150 శ్రేణిలో మరో తక్షణ మద్దతు స్థాయి లభించొచ్చు. ఎగువ స్థాయిలో 17,700 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ మార్కెట్ హెడ్ అపూర్వ సేథ్ తెలిపారు. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు మరోసారి తెరపైకి రావడంతో పాటు దేశీయ జూన్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడంతో గతవారం సూచీలు స్వల్ప నష్టంతో ముగిశాయి. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 31 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లను కోల్పోయాయి.
ప్రపంచ పరిణామాలు
యూరోజోన్‌తో పాటు చైనా, జపాన్ దేశాల ఎస్‌అండ్‌పీ గ్లోబల్ సర్వీసెస్ కాంపోసైట్ పీఎంఐ డేటా నేడు(సోమవారం) విడుదల అవుతుంది. అమెరికా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలను మంగళవారం వెల్లడించనుంది. యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ, చైనా వాణిజ్య గణాంకాలు బుధవారం వెలువడుతాయి. అదేరోజున ఈసీబీ వడ్డీరేట్ల ప్రకటన, ఫ్రాన్స్ ట్రేడ్ డేటా, జపాన్ జీడీపీ గణాంకాలు, అమెరికా నిరుద్యోగ గణాంకాలు గురువారం విడుదల అవుతాయి. చైనా ద్రవ్యోల్బణ డేటాను శుక్రవారం ప్రకటించనుంది. కీలకమైన ఈ స్థూల ఆర్థిక గణాంకాల నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు.
20 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు
ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరగడం, క్రూడాయిల్ ధరల స్థిరీకరణల ప్రభావంతో ఆగస్టులో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీల్లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇది 20 నెలల్లోనే అత్యధికమని డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. 2020, డిసెంబర్‌లో వచ్చిన రూ. 62,016 కోట్ల పెట్టుబడుల తర్వాత ఇదే అత్యధికం. అంతకుముందు జూలైలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
గతేడాది (2021) అక్టోబర్ నుంచి తొమ్మిది నెలల పాటు ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 2.46 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారు. ‘‘యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందనే స్పష్టత వచ్చింది. ఆగస్టుతో పోలిస్తే పెట్టుబడుల వేగం తగ్గినప్పటికీ ప్రస్తుత నెల(సెప్టెంబర్)లోనూ ఎఫ్‌పీఐ నిధుల రాక కొనసాగవచ్చు. అధిక ద్రవ్యోల్బణం, డాలర్ మారకం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఎఫ్‌పీఐలను ప్రభావితం చేస్తాయి’’ అని ట్రేడ్‌స్మార్ట్ చైర్మన్ విజయ్ సింఘానియా తెలిపారు.
నేటి నుంచి తమిళ్ మెర్కంటైల్ బ్యాంక్ ఐపీవో
తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు జరిగే ఈ ఐపీఓ సెప్టెంబర్ 7న ముగుస్తుంది. ధరల శ్రేణి రూ. 500 – 525గా ఉంది. గతవారాంతాన యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.363 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. ఇష్యూలో భాగంగా 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 832 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment