7,600 పాయింట్ల దిగువకు నిఫ్టీ
♦ రెండో రోజూ నష్టాలే..
♦ 66 పాయింట్ల నష్టంతో 24,900కు సెన్సెక్స్
♦ 18 పాయింట్లు క్షీణించి 7,597కు నిఫ్టీ
ముంబై: ఒడిదుడుకులమయంగా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లోమార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఫార్మా షేర్ల క్షీణతతో స్టాక్ సూచీలకు రెండో రోజూ నష్టాలు తప్పలేదు. మార్చి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో 2 రోజుల్లో ముగియనున్నందున ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. నిఫ్టీ 7,600 పాయింట్ల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 66 పాయింట్లు నష్టపోయి 24,900 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 7,597 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా, ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజీ షేర్లు నష్టపోయాయి. వాహన, లోహ, కొన్ని బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
ఫార్మా షేర్లు విలవిల: భారత ఫార్మా కంపెనీలకు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని మణిదీప్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిబంధనలను ఉల్లంఘించిందని లుపిన్‌కు ఎఫ్‌డీఏ నుంచి శ్రీముఖం అందింది. ఇంట్రాడేలో ఈ షేర్ 14 శాతం వరకూ నష్టపోయింది. ఏడాది కనిష్ట స్థాయి(రూ.1,294)ని తాకింది. ఎఫ్‌డీఏ అభ్యంతరాల ప్రభావం ఈ ప్లాంట్ ఎగుమతులపై స్వల్పంగానే ఉంటుందన్న కంపెనీ వివరణతో ఈ షేర్ నష్టాలు తగ్గాయి. చివరకు 6 శాతం నష్టంతో రూ.1,401 వద్ద ముగసింది. ఈ ప్రభావం ఇతర ఫార్మా షేర్లపై కూడా పడింది. సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా 2-5 శాతం రేంజ్‌లో నష్టపోయాయి.
♦ మారుతీ 2.5 శాతం అప్: మారుతీ సుజుకీకు ఓవర్ వెయిట్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నామని మోర్గాన్ స్టాన్లీ వెల్లడించడంతో ఈ షేర్ 2.6 శాతం లాభపడి రూ.3,733కు చేరింది.