న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులు తదితర అంశాలు ఈ వారం మార్కెట్ల కదలికలపై ప్రభావం చూపనున్నాయి. వీటికితోడు ఆగస్టు డెరివేటివ్ సిరీస్ ముగింపు సైతం కీలకంకానున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గడిచిన వారంలో జాక్సన్ హోల్ వద్ద యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ పలు అంశాలపై చేసిన ప్రసంగానికీ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వచ్చే నెల(సెప్టెంబర్)లో నిర్వహించనున్న పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపునకు వీలున్నట్లు పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో వారాంతాన యూఎస్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. లాభాలతో ముగిశాయి. ఈ బాటలో దేశీయంగానూ సెంటిమెంటు మెరుగుపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
మరింత పురోగతి
స్టాక్ ఆధారిత కదలికల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు మరింత పురోగమించే వీలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నెలవారీ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగియనున్న కారణంగా మార్కెట్లు కొంతమేర ఆటుపోట్లను చవిచూడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. భవిష్యత్‌లో వడ్డీ రేట్ల తగ్గింపు బాటలో సాగేందుకు తగిన విధంగా సన్నద్ధమవుతున్నట్లు పావెల్ సంకేతాలిచ్చినట్లు తెలియజేశారు. దీంతో నేడు(సోమవారం) మార్కెట్లు పావెల్ ప్రసంగానికి అనుగుణంగా రియాక్ట్‌కానున్నట్లు అంచనా వేశారు. పాలసీ సర్దుబాట్లకు తగిన సమయం ఆసన్నమైనట్లు పావెల్ పేర్కొనడం గమనార్హం! వచ్చే సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు పలువురు నిపుణులు ఊహిస్తున్నారు. ఉపాధి గణాంకాలు బలహీనపడిన నేపథ్యంలో వేగవంత చర్యలకు వీలున్నట్లు భావిస్తున్నారు.
మాంద్యానికి చెక్
ఈ నెల మొదట్లో యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడనున్నట్లు చెలరేగిన ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అయితే ఫెడ్ చైర్మన్ పావెల్ సమీప భవిష్యత్‌లో ఇందుకు అవకాశాలు తక్కువేనంటూ అభిప్రాయపడ్డారు. అయితే వడ్డీ రేట్లను అధిక స్థాయిలో తగ్గించే అవకాశాలు తక్కువేనని యాక్సిస్ సెక్యూరిటీస్ పీఎంఎస్ విభాగం ఇన్వెస్ట్‌మెంట్ చీఫ్ నవీన్ కులకర్ణి పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పాలసీ సర్దుబాట్లకు వీలున్నట్లు తెలియజేశారు.
గత వారమిలా
గత వారం సెన్సెక్స్ నికరంగా 649 పాయింట్లు జమ చేసుకుంది. 81,086 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 282 పాయింట్లు బలపడి 24,823 వద్ద స్థిరపడింది. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.1,609 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ.13,020 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment