
ఇటీవల అనిశ్చితిలో పడిన సహాయక ప్యాకేజీపై చర్చలు తిరిగి ప్రారంభంకావడంతో గురువారం యూఎస్ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడింది. ఎన్నికలయ్యే వరకూ స్టిములస్‌పై చర్చించేదిలేదంటూ ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా దిగిరావడంతో బంగారం ధరలు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19 ధాటికి నీరసిస్తున్న ఆర్థిక వ్యవస్థతోపాటు.. నిరుద్యోగులు, చిన్న, మధ్యతరహా కంపెనీలకు దన్నునిచ్చేందుకు వీలుగా అమెరికన్ కాంగ్రెస్‌లో ప్యాకేజీపై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంలో డెమొక్రాట్లు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య విభేధాలు తలెత్తడంతో ఈ వారం మొదట్లో చర్చలు నిలిచిపోయిన విషయం విదితమే.
బలపడ్డాయ్
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 339 లాభపడి రూ. 50,514 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 872 ఎగసి రూ. 61,391 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో బంగారం రూ. 50,600 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 50,300 వద్ద కనిష్టానికి చేరింది. ఇదే విధంగా వెండి తొలుత రూ. 61,718 వరకూ పెరిగిన వెండి ఒక దశలో రూ. 61,038 వరకూ నీరసించింది.
లాభాలలో
న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం లాభాలతో కదులుతున్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1 శాతం పుంజుకుని 1,914 డాలర్ల ఎగువకు చేరగా.. స్పాట్ మార్కెట్లోనూ 0.85 శాతం బలపడి 1,910 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్ 2 శాతంపైగా జంప్‌చేసి 24.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.