లాభాల్లో బంగారం- వెండి ధరలు | Gold, Silver prices up in MCX, New York Comex | Sakshi
Sakshi News home page

లాభాల్లో బంగారం- వెండి

Published Tue, Oct 27 2020 11:37 AM | Last Updated on Tue, Oct 27 2020 11:37 AM

Gold, Silver prices up in MCX, New York Comex - Sakshi

కొద్ది రోజులుగా కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న బంగారం, వెండి ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్‌లోనూ సానుకూలంగా కదులుతున్నాయి. యూఎస్‌ ప్రభుత్వ ప్యాకేజీపై కొనసాగుతున్న అనిశ్చితి మరోసారి స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసినప్పటికీ.. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, ఇటలీలలో ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్‌-19 కేసులు బంగారం, వెండి తదితర విలువైన లోహాలకు డిమాండ్‌ను పెంచుతున్నట్లు  బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు రక్షణాత్మక పెట్టుబడిగా కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్‌ వంటి సంస్థలు పసిడిలో కొనుగోళ్లకు ఆసక్తి చూపే సంగతి తెలిసిందే.

సానుకూలం
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం  రూ. 110 పుంజుకుని రూ. 51,040 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 544 బలపడి రూ. 62,450 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో పసిడి 51,114 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 51,002 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక తొలుత ఒక దశలో 62,548 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 62,312 వరకూ క్షీణించింది. 

కామెక్స్‌లో..
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.25 శాతం బలపడి 1,910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.3 శాతం పుంజుకుని 1,908 డాలర్లకు చేరింది. వెండి మరింత అధికంగా 0.7 శాతం ఎగసి ఔన్స్ 24.59 డాలర్ల వద్ద కదులుతోంది. 

అటూఇటుగా
ఎంసీఎక్స్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం స్వల్పంగా రూ. 86 పెరిగి రూ. 50,925 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,125 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,552 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 469 క్షీణించి రూ. 61,980 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,480 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,251 వరకూ వెనకడుగు వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement