
సాక్షి,ముంబై: ఇటీవలి కాలంలో ఆకాశానికి చేరిన బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్ల సంకేతాలతో దిగి వస్తున్నాయి. బంగారం ధరలతోపాటు వెండి ధర కూడా మంగళవారం క్షీణించింది. అంతర్జాతీయంగా ధరలు ఏడు రోజుల కనిష్టానికి చేరగా, దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా వెయ్యి రూపాయలు పతనమైంది.
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర 52,760 వద్ద ఉంది. వెండి ధర కిలోకి 1500 రూపాయలు క్షీణించి 61,500గా ఉంది. దేశీయ మార్కెట్లలో మే నెల అంతా వెండి బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రెండు రోజుల క్రితం నెల రోజుల గరిష్టాన్ని తాకిన పసిడి ధర ఈ రెండు రోజుల్లో రూ.1300 మేర తగ్గడం విశేషం.
అటు ఎంసీఎక్స్ గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 0.4 శాతం క్షీణించి10 గ్రాముల ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.50,445కి చేరుకుంది. వెండి ధరలు కూడి ఇద్దే బాట పట్టాయి. జూలై ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గి కిలోకు రూ. 59,867 వద్దకు పడిపోయింది. యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేటును దాదాపు 50 బీపీఎస్ పాయింట్లు పెంచననుందని ఇదిడాలర్‌కు మరింత బలమని పెట్టబడిదారులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణకోసమే వడ్డీ రేటును పెంచనుందని అంచనా. ఇది పసిడి ధరలకు నెగిటివ్‌గా ఉంటుందని, ఈ స్థాయిలలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
చైనాలో మాంద్యం భయాలు, రికార్డు స్థాయికి బలపడుతున్న డాలరు, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక వారం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు తాజా కోవిడ్ ఆంక్షలతో గ్లోబల్‌గా ఆయిల్ ధరలు లాభనష్టాల మధ్య ఊగిస లాడాయి. గత సెషన్‌లో 78.03 వద్ద స్థిరపడిన దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం అమెరికా డాలర్‌తో 78.02 వద్ద ప్రారంభమై 77.98 వద్ద ముగిసింది. ఇక డాలర్ 20 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అటు స్టాక్‌మార్కెట్లో సోమవారం నాటి బ్లడ్ బాత్ ఛాయలు మంగళవారం కూడా కనిపించాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిస లాడిన సూచీలు చివరకు కనీస మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి.
Comments
Please login to add a commentAdd a comment