న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంకులలో ప్రభుత్వం ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేయనుంది. పంకజ్ శర్మను 2022 ఏప్రిల్ 11 నుంచి డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించినట్లు పీఎన్‌బీ పేర్కొంది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేటంతవరకూ బాధ్యతల్లో కొనసాగుతారని తెలియజేసింది. పంకజ్ జైన్ స్థానే శర్మ పదవిని చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పంకజ్ శర్మ ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం ఈ నెల 11న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మనోజ్ సహాయ్, సుశీల్ కుమార్ సింగ్‌లను డైరెక్టర్లుగా నియమించినట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది. మీరా శ్వాంప్, అన్షుమన్ శర్మ స్థానే వీరి నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు వీరు బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొంది.
ప్రత్యేక నియామకం
ప్రస్తుతం ప్రయివేట్ రంగ సంస్థగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్‌ఐసీకి 49.24 శాతం చొప్పున వాటా ఉంది. దీంతో కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 161(3) ప్రకారం ప్రభుత్వ నామినీ డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించినట్లు బ్యాంక్ వివరించింది. కాగా.. ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఎంజీ జయశ్రీని డైరెక్టర్‌గా నామినేట్ చేసినట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా జయశ్రీ విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ప్రభుత్వ నామినీ డైరెక్టర్ల నియామక వార్తల నేపథ్యంలో పీఎన్‌బీ షేరు బీఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 36.75 వద్ద, ఐడీబీఐ బ్యాంక్ 3 శాతం నష్టంతో రూ. 46 వద్ద ముగిశాయి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 1.5 శాతం నీరసించి రూ. 17 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment