ముంబై: కోవిడ్–19 నేపథ్యంలో పెరిగిన ‘అన్‌సెక్యూర్డ్’ రుణ ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోయిందని ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. ఇప్పుడు ఈ విభాగం విషయంలో బ్యాంక్ ప్రోత్సాహకర పరిస్థితి కలిగి ఉందని వివరించింది. బ్యాంక్ అన్‌సెక్యూర్డ్ రుణ పుస్తకంలో క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు కూడా ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కన్సూ్యమర్ ఫైనాన్స్ కంట్రీ హెడ్ పరాగ్ రావ్ ఈ విషయంపై మాట్లాడుతూ, కొంచెం ఇబ్బంది ఉండే వీలున్నప్పటికీ, వచ్చే రెండేళ్లలో ఈ విభాగంలో మరింత వృద్ధి చెందడానికే అధిక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే మహమ్మారి నేపథ్యంలో అన్ సెక్యూర్డ్ రుణాల నాణ్యతలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, అయితే ఎప్పుడూ ఆందోళన కలిగించే స్థాయిలో పరిస్థితి లేదని వివరణ ఇచ్చారు. మహమ్మారి సమస్య దాదాపు ప్రస్తుతం కనుమరుగయ్యిందని పేర్కొన్న ఆయన, ఈ నేపథ్యంలో క్రమంగా రుణాల పరిమాణం మెరుగుపడుతోందని అన్నారు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి, వినియోగం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో అన్‌సెక్యూర్డ్ రుణాలు తదుపరి 18-24 నెలల్లో మరింత వృద్ధి చెందడానికి అవకాశం ఉందని భావిస్తున్నామని తెలిపారు.
కో– బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఆవిష్కరణ
కాగా, అంతకుమందు పరాగ్ రావ్ ప్రముఖ రిటైలర్ షాపర్స్ స్టాప్‌తో సహ–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించారు. తన వ్యాపారంలో కో–బ్రాండెడ్ కార్డ్‌ల సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్న లక్ష్యాన్ని బ్యాంక్ నిర్దేశించుకుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కో–బ్రాండెడ్ కార్డ్‌ల నుండి వచ్చే మూడేళ్లలో ఆదాయాన్ని ప్రస్తుత 15 శాతం నుండి దాదాపు రెట్టింపు చేసుకోవాలని బ్యాంక్ లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. కార్డుల సంఖ్య పరంగా, కో–బ్రాండెడ్ కార్డుల వాటా ప్రస్తుత 12 శాతం నుండి 35 శాతానికి చేరుకునే అవకాశం ఉందని రావు చెప్పారు. ఈ విషయంలో సహ భాగస్వామ్యులతో అవగాహనలు కుదుర్చుకోవడంపై బ్యాంక్ దృష్టి పెట్టిందని అన్నారు. మల్టీ–పోర్ట్‌ఫోలియో భాగస్వామ్యాలు, టెలికం కంపెనీలు, డైనింగ్– లోకల్ మొబిలిటీ సంస్థలు తమ లిస్ట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. బీఎన్‌పీఎల్ (ఇప్పుడు కొనుగోలు చేయండి తర్వాత చెల్లించండి) ట్రెండ్ పెరుగుతున్న తరుణంలో, ఈ దిశలో వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలని బ్యాంక్ భావిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఫిన్‌టెక్‌ల ద్వారా ఈ విధానం ఊపందుకుంటోందని అన్నారు. అయితే, బీఎన్‌పీఎల్ విధానం కొత్త కస్టమర్‌లను సంపాదించడానికి మాత్రమే ఉద్దేశించినదనీ, రుణ పుస్తకాన్ని పెంచువాలన్నది దీని లక్ష్యం కాదని ఆయన తెలిపారు.
పెరుగుతున్న బ్యాంక్ క్రెడిట్ కార్టులు
ప్రస్తుతం, బ్యాంక్ 1.6 కోట్ల క్రెడిట్ కార్డులను కలిగి ఉందని, ప్రతి నెలా దాదాపు 5 లక్షలు అదనంగా ఈ సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నియంత్రణా పరమైన నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ జారీని వేగవంతం చూస్తూ, భారీ లక్ష్యాలను సాధించాలని బ్యాంక్ నిర్దేశించుకుందని తెలిపారు. మరో 6 నుంచి 9 నెలల్లో ఈ దిశలో మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నామన్నారు.
యాక్సిస్–సిటీ బ్యాంక్ ఎఫెక్ట్ ఉండదు...
సిటీ బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయడం గురించి ఆయన మాట్లాడుతూ, ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. షాపర్స్ స్టాప్‌తో బ్యాంక్ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, రాబోయే మూడేళ్లలో కోటి సహ–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను విక్రయించాలని తమ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుందని రావు చెప్పారు. రెండు వేరియంట్‌లలో ఆవిష్కరించిన కార్డ్‌లలో ఒక దాని వార్షిక చార్జీ రూ. 5,000. ఈ కార్డ్ ద్వారా పలు ఉచిత ఆఫర్లను పొందవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment