
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో 20,000 మంది మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ల విషయంలో తమ కస్టమర్లకు నమ్మకం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. 2020–21లో హీరో ఎలక్ట్రిక్ 52,000 యూనిట్లను విక్రయించింది. రెండేళ్లలో దేశవ్యాప్తంగా 20,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ధ్యేయం. ఇప్పటి వరకు 4,000 మంది మెకానిక్‌లు శిక్షణ పొందగా, 1,500 చార్జింగ్ పాయింట్స్‌ను అందుబాటులోకి తెచ్చామని హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజాల్ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష యూనిట్లను విక్రయించాలన్నది లక్ష్యమని వెల్లడించారు. వార్షిక తయారీ సామర్థ్యాన్ని 75,000 నుంచి 3,00,000 యూనిట్లకు చేరుస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కొత్త తయారీ కేంద్రం నెలకొల్పుతామని, ఇది కార్యరూపం దాలిస్తే స్థాపిత తయారీ సామర్థ్యం 10 లక్షల యూనిట్లకు చేరుతుందని తెలిపారు. తయారీ సామర్థం పెంపు, ఉత్పత్తి కేంద్రాల ఆధునీకరణ, సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు కంపెనీ రూ.700 కోట్లు ఖర్చు చేయనుంది. 2–3 కొత్త మోడళ్లను ఈ ఏడాది ప్రవేశపెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment