రెండు రోజులుగా అమెరికా మార్కెట్ల పతనం, చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తున్నప్పటికీ ఎంపిక చేసిన కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ట్రెండ్‌కు ఎదురీదుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ప్యాకేజ్‌డ్ ఫుడ్ కంపెనీలు హిందుస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్, డీఎఫ్‌ఎం ఫుడ్స్ లిమిటెడ్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. వెరసి వారాంతాన నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో మరోసారి సందడి చేశాయి. ఇందుకు ప్రధానంగా కోవిడ్-19 నేపథ్యంలో ప్యాకేజ్‌డ్ ఫుడ్‌కు పెరుగుతున్న ఆదరణ కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది క్యూ1లో హిందుస్తాన్ ఫుడ్స్ పటిష్ట ఫలితాలు సాధించడం జత కలిసినట్లు తెలియజేశారు. ఎఫ్‌ఎంసీజీ విభాగంలో కార్యకలాపాలు విస్తరించిన ఈ కంపెనీలు ఇకపై మెరుగైన పనితీరును చూపవచ్చన్న అంచనాలు సైతం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్లు వివరించారు. వివరాలు చూద్దాం..
హిందుస్తాన్ ఫుడ్స్ లిమిటెడ్
శుక్రవారం వరుసగా మూడో రోజు హిందుస్తాన్ ఫుడ్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 858 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత 2 రోజుల్లోనూ అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో నమోదైన కనిష్టం రూ. 380 నుంచి చూస్తే 126 శాతం దూసుకెళ్లింది. కంపెనీ ప్రధానంగా హిందుస్తాన్ యూనిలీవవర్, పెప్సీ కో తదితర ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలకు కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తుంటుంది.
డీఎఫ్‌ఎం ఫుడ్స్ లిమిటెడ్
ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ విభాగంలో క్రాక్స్, కర్ల్స్, నట్‌ఖట్ తదితర బ్రాండ్లు కలిగిన డీఎఫ్‌ఎం ఫుడ్స్ కౌంటర్ శుక్రవారం వరుసగా నాలుగో రోజూ వెలుగులో నిలిచింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 7 శాతం జంప్‌చేసింది. రూ. 360ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. చివరికి 2.6 శాతం లాభంతో రూ. 342 వద్ద స్థిరపడింది. గత 4 సెషన్లలోనే డీఎఫ్‌ఎం ఫుడ్స్ షేరు 24 శాతం ర్యాలీ చేసింది. ఈ బాటలో 2020 మార్చిలో నమోదైన కనిష్టం రూ. 154 నుంచి షేరు 133 శాతం జంప్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment