
సాక్షి, న్యూఢిల్లీ: ఇళ్ల ధరలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో దేశంలోని ఏడు అతిపెద్ద పట్టణాల్లో ఇళ్ల ధరలు ఒక శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘అనరాక్’ తెలిపింది. ముడి సరుకుల ధరలకు రెక్కలు వచ్చినందున 2021 ద్వితీయ ఆరు నెలల కాలంలో ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేస్తోంది.
ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఏడు ప్రధాన పట్టణాల్లో చదరపు అడుగు సగటు ధర రూ.5,599 నుంచి రూ.6,660కు పెరిగింది. 2020 మొదటి మూడు నెలల్లో ధరలతో పోల్చి ఈ వివరాలు విడుదల చేసింది. నివాస గృహాల ధరల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది.
► ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్లో మాత్రం ఇళ్ల ధరలు 2 శాతం పెరిగి చదరపు అడుగు రూ.4,650కు చేరింది.
► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో (ఎంఎంఆర్) ఒక శాతం పెరిగి చదరపు అడుగు రూ.10,750కు చేరింది.
► బెంగళూరు మార్కెట్లో 2 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.5,060గా ఉంది.
► పుణెలోనూ ఒక శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.5,580కు చేరింది.
► కోల్‌కతా మార్కెట్లో పెద్ద మార్పు లేదు. చదరపు అడుగు ధర రూ.4,385 నుంచి రూ.4,400 వరకు పెరిగింది.
► చెన్నై మార్కెట్లో ఒక శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.4,935గా ఉంది.
► ఇక హైదరాబాద్ మార్కెట్లో ఒక శాతం పెరిగి చదరపు అడుగు విక్రయ ధర రూ.4,195 నుంచి రూ.4,240కు చేరింది.
► 2020 సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఏడు ప్రధాన పట్టణాల్లో 45,200 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదు కాగా.. 2021 మొదటి మూడు నెలల్లో 58,290 ఇళ్ల విక్రయాలు నమోదు కావచ్చని అనరాక్ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment