న్యూఢిల్లీ: దేశీయ గృహాల విక్రయాలు మళ్లీ జోరందుకున్నాయి. గతేడాది అక్టోబర్–డిసెంబర్ నాల్గో త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు 25 శాతం పెరిగి 1,10,811 యూనిట్లకు చేరాయి. క్రితం సంవత్సరం ఇదే కాలంలో అమ్మకాలు 88,976 యూనిట్లుగా ఉన్నాయని ప్రాప్‌ఈక్విటీ డేటా అనలిటిక్ట్ సంస్థ తెలిపింది. 2020 క్యూ3తో పోలిస్తే క్యూ4లో హౌసింగ్ సేల్స్ 78 శాతం వృద్ధి చెంది.. 62,197 యూనిట్లుగా ఉన్నాయి. కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవటంతో కొనుగోలుదారుల్లో నూతనోత్సాహం నెలకొందని, అలాగే పండుగ సీజన్స్, డెవలపర్ల ఆఫర్లు ఇతరత్రా కారణాలు కొనుగోళ్ల వృద్ధికి కారణాలని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్ అండ్ ఎండీ సమీర్ జాసుజా తెలిపారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, త్వరలోనే పూర్తి కానున్న గృహాలకు మాత్రమే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. నిర్మాణంలో నాణ్యత, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో గణనీయమైన విక్రయాలు ఉన్నట్లు నివేదికలో తేలింది.
నగరాల వారీగా చూస్తే..
2020 మొత్తం ఏడాది అమ్మకాల్లో మాత్రం 16 శాతం క్షీణత నమోదైంది. 2019లో 3,41,466 ఇళ్లు అమ్ముడుపోగా.. గతేడాది 2,86,951 యూనిట్లు విక్రయమయ్యాయి. ఒక్క ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో మినహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గతేడాది గృహాల విక్రయాలు క్షీణించాయి. 2019లో ఎంఎంఆర్‌లో 1,07,562 గృహాలు అమ్ముడుపోగా.. గతేడాది 3 శాతం వృద్ధి రేటుతో 1,11,256 యూనిట్లు విక్రయం అయ్యాయి. హైదరాబాద్‌లో 2019లో 31,038 యూనిట్లు సేల్ కాగా.. గతేడాది 14 శాతం తగ్గి 26,716 యూనిట్లకు పరిమితమయ్యాయి. కోల్‌కత్తాలో 19,272 నుంచి 12,026 యూనిట్లకు (–38 శాతం), ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 44,894 నుంచి 29,640 యూనిట్లకు (–34), పుణేలో 74,791 యూనిట్ల నుంచి 62,043 యూనిట్లకు (–17 శాతం), బెంగళూరులో 46,969 యూనిట్ల నుంచి 33,363 యూనిట్లకు (–29 శాతం), చెన్నైలో 16,940 నుంచి 11,907 యూనిట్లు (–30%) విక్రయమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment